కరకగూడెం, జూలై 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. రేగా మాతృమూర్తి నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. తొలుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి మినీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్న కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు.
రోడ్డు మార్గాన కేటీఆర్ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ కారులో రేగా స్వగృహానికి చేరుకున్నారు. రేగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేగా నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కేటీఆర్ ప్రతి ఒక్కరికి కరచాలనం చేసుకుంటూ కాసేపు ముచ్చటించారు. భోజనం అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.
కేటీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, శంకర్‌నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, వనమా రాఘవ తదితరులు ఉన్నారు.