రఘునాథపాలెం, జూన్ 15 : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు పర్యటనకు వస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న శ్రీహర్ష కన్వెన్షన్ హాల్లో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగే నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.
ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయం(తెలంగాణ భవన్)లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఎస్ఐఆర్లో భాగంగా అర్హులైన వారు తమ ఓటు హక్కును కోల్పోకూడదనేది పార్టీ ప్రధాన ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా పాలేరు నియోజకవర్గం కోసం నియమించిన 291 మంది బూత్ లెవల్ అసిస్టెంట్లతోపాటు ఈ-డిజిటల్ సభ్యులు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులైన సుమారు వెయ్యి మందితో యువనేత కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్ఐఆర్లో భాగంగా ఇంటింటికీ తిరుగుతున్న బీఎల్వోలు రకరకాల ప్రశ్నలు వేస్తున్నారని, తెలిసీ తెలియని సందర్భాన్ని ఆసరాగా తీసుకొని ఓటర్లను తప్పుదోవ పట్టించి ఓటు తొలగింపు జరిగితే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అవుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఓటు కూడా తొలగింపునకు గురికావొద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.
అంతేకాక బీఆర్ఎస్ పార్టీ త్వరలో చేపట్టబోయే 100 శాతం డిజిటలైజేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమ విధానంపైనా కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన యాప్ను రెండు రోజుల్లో పార్టీ అధినేత కేసీఆర్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదును పర్యవేక్షించడానికి ప్రతీ మండలానికి ఐదుగురు చొప్పున సమన్వయ కమిటీ సభ్యులను నియమించినట్లు తెలిపారు. అలాగే గ్రామ, మండల, జిల్లా కమిటీలు, వాటి అనుబంధ కమిటీల నియామకం త్వరలోనే చేపడతామన్నారు. ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదుపై నిర్వహించే సమావేశంలో కేటీఆర్ ఒక స్పూర్తిదాయకమైన సందేశాన్ని ఇవ్వనున్నారని, జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం రూరల్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నాయకులు ఉన్నం బ్రహ్మయ్య, బిచ్చాల తిరుమలరావు, వేముల వీరయ్య, పాలేరు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.