భద్రాచలం, సెప్టెంబర్ 16: దసరా తర్వాత డేట్ ఫిక్స్ చేస్తే తానే భద్రాచలం వస్తానని.. అక్కడి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును, కాంగ్రెస్ను అక్కడే బొందపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎంతో నమ్మకంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిచి తెల్లం వెంకట్రావుకు భద్రాచలం టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ పార్టీకి వెంకట్రావు ద్రోహం చేసి కాంగ్రెస్లో కలిశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తానున్నది ఏ పార్టీయో చెప్పుకోలేని స్థితిలో తెల్లం వెంకట్రావు తెల్లబోతున్నాడని విమర్శించారు. వెంకట్రావుకు ధైర్యముంటే భద్రాచలం ఉప ఎన్నికకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంతో నమ్మకంతో పార్టీ అధినేత కేసీఆర్.. తెల్లం వెంకట్రావును పిలిచి పార్టీ టికెట్ ఇచ్చారని, భద్రాచలం నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ను చూసి తెల్లం వెంకట్రావును గెలిపించారని గుర్తుచేశారు. రాముడి మీద ఒట్టు వేసి మాట ఇచ్చి బీఆర్ఎస్ తరఫున గెలిపిన తెల్లం.. ఆ తరువాత మాట తప్పి కాంగ్రెస్లో చేరారని విమర్శించారు. ఆయన పోతేపోయాడు గానీ ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని స్థితిలో పడ్డాడని విమర్శించారు. రాముడి మీద ఒట్టేసిన వెంకట్రావు మాట తప్పాడు కాబట్టి.. అదే రాముడి సాక్షిగా భద్రాచలం ఉప ఎన్నికలో వెంట్రావును, కాంగ్రెస్ను మట్టి కరిపిద్దామని పిలుపునిచ్చారు. అలాగే, స్థానిక ఎన్నికల్లోనూ భద్రాచలం నియోజకవర్గంలో జడ్పీటీసీలను, ఎంపీటీసీలను గెలుచుకుందామని పిలుపునిచ్చారు. ఇందుకోసం శ్రేణులు శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. పార్టీ పట్ల విధేయతతో, నాయకుడైన కేసీఆర్ మీద నమ్మకంతో చాలాదూరంలో ఉన్న భద్రాచలం నుంచి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే అక్కడ మన పార్టీ ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతోందని అన్నారు.
అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి కూడా కేసీఆర్ను విమర్శిస్తుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. ‘తంతే బూరెల బుట్టలో పడ్డట్లు’గా.. ఒకసారి గెలిచినందుకే అంతగా పొంగిపోవొద్దని పొంగులేటిని కేటీఆర్ విమర్శించారు. అదే పొంగులేటి.. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి తిరిగిన సంగతిని గుర్తుకు తెచ్చుకోవాలని హితవు చెప్పారు. నిరుడు పొంగులేటి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరిగాయని, అప్పుడు టీవీల్లోనూ బ్రేకింగ్ న్యూస్లు వచ్చాయని గుర్తుచేశారు. కానీ పొంగులేటి ఇంట్లో ఎన్ని డబ్బులు దొరికాయో ఇటు ఈడీగానీ, అటు పొంగులేటిగానీ ఇంత వరకూ చెప్పలేదని జ్ఞప్తికి తెచ్చారు. పొంగులేటి బీజేపీతో కుమ్మక్కయ్యాడో, రేవంత్రెడ్డి పొంగులేటితో కుమ్మక్కయ్యాడో దీనిని బట్టే అర్థమవుతోందని అన్నారు.
బీఆర్ఎస్ వాజేడు నాయకుడు నరసింహమూర్తి మాటలు తనను కంటితడి పెట్టించాయని కేటీఆర్ పేర్కొన్నారు. ‘నా యావదాస్తినీ అమ్మి అయినా సరే.. కేసీఆర్ను గెలిపిస్తాను. ఆయన కోసమే పనిచేస్తాను. దుర్మార్గపు కాంగ్రెస్ పాలనను ఎదురోవడానికి నా యావదాస్తినీ తెగనమ్ముతాను. కానీ కేసీఆర్ను వదలను.’ అంటూ నరసింహమూర్తి చేసిన వ్యాఖ్యలు తన కళ్లను చెమర్చేలా చేశారని అన్నారు. ఈ సందర్భంగా నరసింహమూర్తిని కేటీఆర్ అభినందించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, భద్రాచలం నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, బోదబోయిన బుచ్చయ్య, నరసింహమూర్తి, ఆకోజు సునీల్, గంప రాంబాబు, కృష్ణారెడ్డి, జానీపాషా, అన్నెం సత్యాలు, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలన రైతులకు శ్రీరామరక్షలా కొనసాగిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆయన పాలనలో రైతులకు యూరియా కష్టాలు లేనేలేవని స్పష్టం చేశారు. రైతుల కష్టాలు తెలిసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందుగానే రైతులకు ఏమేమి కావాలో వాటిని అందుబాటులో ఉంచేవారని జ్ఞప్తికి తెచ్చారు. అలాగే, భగీరథ నీళ్లు, పోడు పట్టాలు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటివన్నీ సమకూర్చారని వివరించారు. వ్యవసాయం చేసే ప్రతి రైతునూ రాజును చేశారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్కు ఓటు వేసినందుకు ప్రస్తుతం ప్రజలు విచారపడుతున్నారని, యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతులు కూడా చెప్పుతో కొట్టుకుంటున్నారని గుర్తుచేశారు. అలాగే, కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ పోలీసులైతే బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బందులు పెడుతున్నారో అదే పోలీసులు పార్టీ శ్రేణుల చుట్టూ తిరిగే రోజులు రాబోతున్నాయని అన్నారు.