ఖమ్మం, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హనీమూన్ పర్యటన ముగిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నివాసంలో జరిగిన ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఆయన కంట్లో నలుసుగా బీఆర్ఎస్ ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల సంక్షేమాన్ని మరిచి వారి స్వలాభం కోసమే మంత్రులు పని చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొన్నారు. ఒక మంత్రి కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే పని చేస్తున్నారని, మరో మంత్రి 10-30 శాతం కమీషన్లు తీసుకుంటున్న విషయం బహిర్గతమేనని, మరో మంత్రి తానొకటి చెప్తే సీఎం మరొకటి చెప్తారని ధ్వజమెత్తారు.
ఖమ్మంలో వరదలు వస్తే ముంపు ప్రాంత ప్రజలు అజయ్‌ను గుర్తుకు తెచ్చుకున్నారని, కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోయామని తెలుగు డిక్షనరీలో లేని బూతులను విన్నామని కేటీఆర్ గుర్తుచేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని, రూ.లక్ష కోట్ల బడ్జెట్ అందిస్తామని, బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కేసీఆర్ నిర్వహించిన సర్వేలో బీసీలు 51శాతం ఉంటే కాంగ్రెస్ సర్వేలో 46శాతం తేల్చారని, మిగిలిన 5శాతం బీసీలు ఎక్కడికెళ్లారని కేటీఆర్ ప్రశ్నించారు. ఖమ్మం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వల్ల తాను ఆశ్చర్యానికి గురయ్యానని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్నారు. కేసీఆర్ అన్నట్లుగా గెలిస్తే పొంగేది లేదు.. ఓడితే కుంగేది లేదని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, రైతుబంధు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2014కు ముందు ఖమ్మం ఎలా ఉంది, ప్రస్తుత ఖమ్మం ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పువ్వాడ అజయ్ ఇంటింటికీ తిరిగి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంచారని, మురుగు కాల్వల్లో తిరిగి మురికిని శుభ్రం చేసినప్పటికీ ప్రజలు గుర్తించకపోవడం బాధాకరమన్నారు.
ప్రజలను ఆశల పల్లకిలో ఉంచిన కాంగ్రెస్ నాయకులు, ప్రజలను మరోమారు మోసం చేశారని, కేసీఆర్ రూ.లక్ష ఇస్తే, కాంగ్రెస్ తులం బంగారం అని, రూ.10 వేలు ఇస్తే రూ.15 వేలు అని, రూ.2 వేలు ఇస్తే రూ.4 వేలు అని అందమైన అబద్దాలు చెప్పి ప్రజలను మోసగించిందన్నారు. ప్రజలు ఎన్నిరకాలుగా రేవంత్‌రెడ్డిని తిట్టినా దులుపుకొని పోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చే వరకు గల్లా పట్టుకొని నిలదీస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు పోలీసుల అండతో సీట్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని, వాటన్నింటినీ ఎదురించి బీఆర్ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎలాంటి అక్రమ కేసులు పెడుతున్నారో తాను చూస్తున్నానని, మనోధైర్యం కోల్పోకుండా ప్రజల కోసం పోరాడాలని, అలాంటి వారికి తాము అండగా ఉంటామని, ఎలాంటి భయం అవసరం లేదని భరోసా కల్పించారు. ఖమ్మం జిల్లాలో ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్కు కొంతనష్టం జరిగిందన్నారు.
ఓడిపోయినా కూడా బీఆర్ఎస్ నాయకులు, గులాబీ దండు ఏడాది కాలంలో ప్రజలకు అండగా ఉందన్నారు. ఒక కుటుంబం వరదలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి రక్షించాలనే సోయి ఈ మంత్రులకు లేదన్నారు. ఎమ్మెల్యేల పుట్టినరోజు వేడుకలు, ఇంకా వేరే పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్ నుంచి కూతవేటు దూరానికి కూడా హెలికాప్టర్లో పోతున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వరదలు వస్తే భూపాలపల్లి జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా నాలుగు హెలికాప్టర్లను పంపి ప్రజలను కాపాడామని గుర్తుచేశారు. ఖమ్మంలో వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత కాంగ్రెస్ మంత్రులు పర్యటించారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఓపెన్ టాప్ జీపులో చేతులు ఊపుతూ కాలు కింద పెట్టకుండా అటూ ఇటూ తిరిగి వెళ్లిపోయాడని అన్నారు. ప్రజలు తిడుతున్న తిట్లను వింటే పౌరుషం ఉన్న ఎవడైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడని, కానీ రేవంత్‌రెడ్డికి రోషం లేదు కాబట్టి అన్నీ దుపులుకొని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
స్కూటీలు ఏమయ్యాయని కాలేజీ పిల్లలు కూడా పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారని అన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను నెరవేర్చే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో పునర్ వైభవం సాధించేందుకు కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ మాజీ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు, అన్నివర్గాల శ్రేణులు కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై చొరవగా స్పందిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని సూచించారు.
ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కానుకగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బొమ్మెర రామ్మూర్తి, రఘునాథపాలెం మండల అధ్యక్షుడు వీరూనాయక్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.