ఖమ్మం, సెప్టెంబర్ 3: ఖమ్మంలో కాంగ్రెస్ గూండాల దాడికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మున్నేరు ముంపు బాధితులను పరామర్శించేందుకు, వారి కష్టనష్టాల గురించి తెలుసుకునేందుకు మంగళవారం ఖమ్మంలో పర్యటిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు బృందంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు.
మాజీ మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమని అన్నారు. ప్రజలకు సాయం చేయడం చేతగాక.. సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకనే ఈ దాడికి తెగబడ్డారని దుయ్యబట్టారు. ‘మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి మేము అండగా ఉండడమే తప్పా? ప్రజలకు సేవ చేయడం చేతకాదు.. సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేస్తారా? ఇది సిగ్గుచేటు కాదా?’ అంటూ ప్రశ్నించారు. ఇలాంటివి ఎన్ని దాడులు చేసినా సరే.. ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరని స్పష్టం చేశారు. చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో వారికి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.