భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఉద్యమ సారథి, అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. అధునాతన హంగులతో పూర్తయిన జీప్లస్ 2 సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్‌తో కలిసి ప్రారంభించనున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభా వేదికపై ప్రసంగించనున్నారు. అనంతరం పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం పక్కన నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ బుధవారం పరిశీలించారు.
ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం కొత్తగూడెం జిలాకేంద్రంలో పర్యటించనున్నారు. మహబూబాబాద్ నుంచి హలీకాఫ్టర్లో మధ్యాహ్నం 1.55 గంటలకు కొత్తగూడెం సమీకృత కలెక్టరేట్‌కు చేరుకోనున్నారు. అధునాతన హంగులతో పూర్తయిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు. అనంతరం రోడ్ మార్గంలో పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం పక్కన నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి ప్రకాశం స్టేడియం చేరుకుని హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ బయల్దేరతారు. ఏర్పాట్లను ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ పరిశీలించారు.
కలెక్టర్ ఆవరణలోనే హెలీపాడ్, సభ..
కలెక్టరేట్ ఆవరణలోనే హెలీపాడ్తో పాటు వెనుక భాగంలో సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు సుమారు 10 వేల మంది హాజరుకానున్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మెప్మా అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు అధికారులను సమన్వయం చేయనున్నారు.
పర్యటనకు హాజరు కానున్న మంత్రులు,ప్రజాప్రతినిధులు
పర్యటనలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ పలా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతామధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియానాయక్, రాములునాయక్, కందాళ ఉపేందర్‌రెడ్డి పాల్గొననున్నారు.
అధికారులు 9 గంటల లోపు కలెక్టరేట్లో ఉండాలి..
సీఎం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు గురువారం ఉదయం 9 గంటల లోపు కలెక్టరేట్‌కు చేరుకోవాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమశాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు. ఎవరికి కేటాయించిన విధులను వారు పక్కాగా నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ సక్సెస్..
సీఎం సెక్యూరిటీ ఉన్నతాధికారులు బుధవారం పట్టణంలో నిర్వహించిన సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. సీఎం కేసీఆర్‌కు గౌరవ వందం చేసే పరేడ్ ట్రయల్స్ పూర్తయ్యాయి. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ గంగన్న పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ బలగాలు సమీకృత కలెక్టరేట్‌కు చేరుకున్నాయి. కొత్తగూడెం నుంచి పాల్వంచ వరకు అడుగడుగునా పోలీస్ నిఘా ఏర్పాటైంది.
పర్యటన ఇలా..
సీఎం కేసీఆర్ మహబూబాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1.55 గంటలకు కొత్తగూడెం చేరుకుంటారు. సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. 2.50 గంటలకు బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 3.20 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని ప్రారంభిస్తారు. 4.30 గంటలకు ప్రకాశం స్టేడింయంలోని హెలిప్యాడ్ నుంచి హెలికాఫ్టర్‌లో తిరిగి హైదరాబాద్ బయల్దేరతారు.
భారీ పోలీస్ బందోబస్త్
కొత్తగూడెం క్రైం/ పాల్వంచ, జనవరి 11: సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపారు. పాల్వంచలోని సుగుణ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో బుధవారం పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ట్రాఫిక్ ఆంక్షలను ఉన్నాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలన్నారు. విధుల్లో సుమారు 2 వేల మంది పోలీసులు ఉంటారన్నారు. ప్రతిఒక్కరూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. సమీక్ష సమావేశంలో భూపాలపల్లి ఎస్పీ సురేందర్‌రెడ్డి, మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీలు టి.సాయిమనోహర్, కేఆర్కే ప్రసాదరావు, కమాండెంట్ కుమారస్వామి, ఏఎస్పీలు బిరుదరాజు రోహిత్ రాజు, అక్షాంశ్ యాదవ్, రామ్‌నాథ్ కేకన్ తదితరులు పాల్గొన్నారు.
బందోబస్తు వివరాలు ఇవీ..
ఎస్పీ వినీత్ గంగన్న మొత్తం బందోబస్తును 12 సెక్టార్లుగా విభజించారు. ఏఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెచ్‌సీలు, పీసీలు, హోంగార్డులు, ఏడు ఏఎస్ తనిఖీ బృందాలు, మూడు రోడ్డు ఓపెన్ పార్టీ బృందాలు, 13 స్పెషల్ పార్టీ బృందాలు, 13 ప్రవేశ ద్వార అదనపు బృందాలు, 18 సెక్షన్ల సీఆర్పీఎఫ్ జవాన్లు ఇలా మొత్తం 1,667 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. కాన్వాయ్ వెంట రెండు స్పెషల్ పార్టీ బలగాలు విధులు నిర్వర్తిస్తాయి