భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుపై కామ్రేడ్ల వైఖరి రెండు నాలుకల ధోరణిగా కనిపిస్తున్నది. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండలంలో 7 గ్రామ పంచాయతీలను కలిపి కార్పొరేషన్ చేయడానికి ప్రభుత్వ అనుమతి రావడంతో కామ్రేడ్లలో కలవరం మొదలైంది. కార్పొరేషన్ అయినట్లు అధికారికంగా ప్రకటించిన మరుసటిరోజు నుంచే పల్లెలను పట్టణంలో కలపొద్దని సీపీఎం పార్టీ తన వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకురావడంతో లెఫ్టు పార్టీల మధ్య మళ్లీ గ్యాప్ రాబోతుందా.. అంటే సమాధానం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కార్పొరేషన్‌కు సీపీఎం పార్టీ వ్యతిరేకం కాదంటూనే మరోపక్క సుజాతనగర్లో ఉన్న ఏడు పంచాయతీలను కార్పొరేషన్లో కలపొద్దని డిమాండ్ చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాని విషయంగా మారింది.
నిన్న మొన్నటి వరకు కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు మున్సిపాలిటీలుగా ఉన్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంను కార్పొరేషన్ చేయాలని గత ప్రభుత్వాలకు సైతం విన్నవిస్తూ వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో పొత్తులో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గూడెం అభివృద్ధినే అజెండా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ను తెరపైకి తీసుకొచ్చి అభివృద్ధికి బీజం వేశారు. దీంతోపాటు విమానాశ్రయానికి కూడా గ్రీన్‌సిగ్నల్ తెప్పించారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ కావడంతో రెండు పట్టణాల ప్రజలు ఆయన కృషిని అభినందించారు. మరోవైపు క్షీరాభిషేకాలు కూడా చేస్తున్నారు. సుజాతనగర్లో ఒక వర్గం మద్దతు కూడా తెలిపారు.
కొత్తగూడెం కార్పొరేషన్ అవడంలో మాకు ఎలాంటి అభ్యతరం లేదు అని సీపీఎం బహిరంగంగా చెబుతూనే పల్లెలను పట్నంలో కలపొద్దనే డిమాండ్ కూడా అదే తరహాలో చేస్తున్నది. సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కార్పొరేషన్లో కలపొద్దని స్థానిక ఎమ్మెల్యేను కలవడంతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా కలిసి వినతిపత్రాలను అందజేశారు. ఏడు పంచాయతీలను కలపడం వల్ల ఉపాధి అవకాశాలు పోతాయని, రైతులు పొలాలను అమ్ముకుని కూలీలుగా మారే అవకాశాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి పొలాలు మిగలవని వారు ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు.
పాల్వంచ, రామవరం పరిధి ఏజెన్సీ ఏరియాలో ఉండడంతో అక్కడ ఉన్న చట్టం ఎవరి పరిధిలోకి వస్తుందని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గిరిజన చట్టాలు ఉన్న ప్రాంతంలో గతంలో పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. అసలు ఎన్నికలు జరగకపోవడానికి కారణం నేటికి ఎవరికీ తెలియకపోవడం విశేషం. దీంతోపాటు చిట్టిరామవరం కూడా ఏజెన్సీలో ఉందని, అందువల్ల అక్కడ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని తెలుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని అభ్యంతరాలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చట్టం చిక్కుముడులు ఎవరు విప్పాలని మేధావివర్గం అభిప్రాయపడుతున్నది.
సుజాతనగర్ మండలంలో ఏడు పంచాయతీలను కలపకుండా కార్పొరేషన్ చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. ప్రతి గ్రామంలో రైతులు ఉన్నారు. కూలీలు ఉన్నారు. కార్పొరేషన్ పరిధిలోకి వెళ్తే ఉపాధి పనులు ఉండవు. రైతులు కూలీలుగా మిగిలిపోతారు. పంట పొలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాగా వేస్తారు. అందుకే మా సమస్యను వినిపిస్తున్నాం. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు.
– కాసాని ఐలయ్య, సీపీఎం సీనియర్ నాయకుడు
పాల్వంచలో కొంతభాగం ఏజెన్సీలో ఉంది. అది మినహాయించి కార్పొరేషన్ చేయాలి. రామవరంలో కూడా కొంత ప్రాంతం ఏజెన్సీలోనే ఉంది. చట్టాలను మార్చడం ఎవరితరం కాదు. స్పష్టత వచ్చాక కార్పొరేషన్ చేస్తే బాగుంటుంది. అభివృద్ధి జరిగితే ఎవరూ కాదనరు. కార్పొరేషన్ అవడం మంచిదే కాని చట్టాలకు మినహాయింపు ఉండాలి.
– వాసం రామకృష్ణ, ఆదివాసీ జేఏసీ నాయకుడు