బోనకల్లు, మార్చి 28 : ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ నమ్మించి అధికారంలోకి వచ్చిందన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తూ పథకాలను అమలు చేయడం లేదన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహిళలకు రూ.2500 వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు.
రైతులకు రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా కల్పిస్తానని చెప్పారు. చివరికి రూ.12000 ఇస్తానని చెప్పి అవి కూడా ఖాతాల్లో జమ చేయలేదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాబోవు రోజుల్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి కిలారు సురేష్, బంధం శ్రీనివాసరావు, తెల్లాకుల శ్రీనివాసరావు, బిల్లా విశ్వనాథం, తెల్లాకుల రజిని, గుగులోత్ నరేష్, శ్రీనివాస రావు, షేక్ సిలార్, బోయినపల్లి వీరబాబు, మంద మైబు, సూరుపల్లి శివ పార్వతి, గద్దె పద్మ, గద్దె రామారావు, చెన్నా లక్ష్యాద్రి, ఏసుపోగు బాబు, తదితరులు పాల్గొన్నారు.