మధిర, మార్చి 24 : కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రైతులను నట్టేట ముంచిందని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. సోమవారం చింతకాని మండలంలోని లచ్చగూడెం గ్రామంలో మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గురిజాల హనుమంతరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామా పెట్టిందన్నారు. వరంగల్ బహిరంగ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.
కనీసం రైతు భరోసా జమ చేయలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. రెండు లక్షల పైబడిన బ్యాంక్ రుణాలు ఉన్న రైతులు చెల్లిస్తే వారి రుణాలు వాపస్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు 2 లక్షల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయటమేనన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు వాటికి నిధుల కేటాయింపే లేదన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు రైతుబంధు పథకం అమలు చేస్తే కాంగ్రెస్ రూ.15 వేలు చెల్లిస్తామని అబద్ధాలు చెప్పి ప్రస్తుతం ఎకరాకు రూ.12 వేలు మాత్రమే జమ చేస్తామని చెప్పి అది కూడా రైతు ఖాతాల్లో జమ చేయలేదన్నారు.
కళాశాలకు వెళ్లే విద్యార్థినులకు స్కూటీలు ఇప్పిస్తామని చెప్పి కనీసం సైకిల్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, మంకెన రమేశ్, బొడ్డు వెంకట రామారావు, జావీద్, వేముల నరసయ్య పాల్గొన్నారు.