రఘునాథపాలెం, జూన్ 19 : ‘ఏరు దాటే దాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న..’ అన్న చందంగా కనిపిస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు. అధికారంలోకి రాకముందు రేవంత్‌రెడ్డి సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం.. కౌలు రైతులకూ రైతుభరోసా అమలు చేస్తాం.. రూ.2 లక్షల్లోపు బ్యాంకు రుణం కలిగిన రైతులందరికీ రుణమాఫీ చేస్తాం.. అంటూ అన్నదాతలకు హామీల వర్షం గుప్పించారు. తీరా అధికారం చేతికి వచ్చాక.. ఇచ్చిన హామీల అమలు సంగతి దేవుడెరుగు కానీ, ఉన్న పథకాలను సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేకపోయింది. తాజాగా సన్న వడ్లు పండించే రైతుల బోనస్‌కు ఎగనామం పెట్టేందుకు రేవంత్ సర్కార్ పూనుకుంది. గతేడాది వరకు 33 రకాల సన్నాలకు బోనస్ అందించిన రేవంత్ సర్కార్.. ప్రస్తుతం బోనస్ కేవలం 7 రకాలకే అంటూ విస్తృత ప్రచారం సాగిస్తోంది. వానకాలం సీజన్లో ఎనిమిది రకాల సన్నాలు మాత్రమే సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తున్నారు. రైతులు సాగు చేసేందుకు అనేక రకాల సన్నాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ ఎనిమిది రకాల వరి వంగడాలను మాత్రమే సాగు చేయాలని అధికారులు సూచిస్తుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. రేవంత్ ప్రభుత్వం సన్న ధాన్యం పండిస్తే బోనస్ రూ.500 ఇస్తుందనే ఆశతో అత్యధికంగా రైతులు గత రెండేళ్లుగా సన్నాలనే పండిస్తున్నారు. కానీ, ఇప్పుడు వ్యవసాయ అధికారులు సూచించిన సన్నాలనే సాగు చేయాలని సూచిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నదాతలు వాపోతున్నారు.
ఖమ్మం జిల్లాలో వానకాలం సీజన్‌కు గానూ సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 2026 వానకాలం సీజన్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన 7 రకాల సీడ్‌ను మాత్రమే సాగు చేయాలని సూచించడంతో రైతులు సందిగ్ధంలో ఉన్నారు. వ్యవసాయ శాఖ ఎంపిక చేసిన విత్తనాలు సాగు చేస్తేనే బోనస్ వస్తుందని, మిగతావి సాగు చేస్తే రాదని ఆందోళన చెందుతున్నారు. రైతులు ప్రతి ఏడాది సాగు చేసే సన్నరకాల్లో అత్యధిక దిగుబడి, చీడపీడలు ఆశించని, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చే వరి వంగడాలను ఎంపిక చేసుకొని మరీ సాగు చేసేవారు. అయితే ఈ ఏడాది వ్యవసాయ శాఖ సూచించిన కొన్ని రకాల వరి విత్తనాలను మాత్రమే సాగు చేసేందుకు రైతులు ముందుకొస్తారా..? లేదా అనేది వేచిచూడాలి. అంతేకాక బోనస్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేందుకు సూస్తున్నదని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వానకాలం సీజన్లో రైతులకు అధిక దిగుబడి వచ్చే సన్న వరి వంగడాలను సాగు చేయాలని సూచిస్తున్నాం. 23 రకాల సన్నాలు ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వరి వంగడాల సాగు డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేయాలని పలు రకాలను తెలియజేస్తున్నాం.
రైతులు సాగుచేసే అన్నిరకాల సన్న ధాన్యానికి ప్రభుత్వం బోనస్ చెల్లించాలి. సన్నాల సాగుకు పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉంటుంది.. దిగుబడి తక్కువగా వస్తుంది. వ్యవసాయ అధికారులు సూచించిన వాటికే కాకుండా అన్ని రకాల సన్నాలకు బోనస్ చెల్లించి రైతులను ఆదుకోవాలి. కొన్ని రకాలకే బోనస్ ఇస్తే ఊరుకునేది లేదు.