ఖమ్మం రూరల్, మే 26 : ఖమ్మం రూరల్ మండలం సబ్ రిజిస్టార్ అరుణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కింది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన కొడుకు పేరు మీద సొంత భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు గాను కొద్ది రోజుల క్రితం సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సంప్రదించాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చాలానా తీశాడు. అయితే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కు చేసినందుకు సబ్ రిజిస్టార్ రూ.50 వేలు డిమాండ్ చేసి రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని బాధితులు ఏసీబీ అధికారులకు తెలిపారు.
సబ్ రిజిస్టార్ ఆదేశంతో సోమవారం ఉదయం డాక్యుమెంటరీ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్ కార్యాలయంలో బాధితుడు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు చట్ట ప్రకారం చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉంటామని, టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేసి సంప్రదించవచ్చన్నారు.