ఖమ్మం రూరల్, మే 08 : సామాజిక కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించే ఖమ్మం రూరల్ మండలం తాసీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరోమారు తన ఔదార్యం చాటుకున్నారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో వైరా పట్డణ శివారులోని డివైడర్ దగ్గర ఓ యువతి ఖమ్మం నుండి సత్తుపల్లి వెళ్తూ పక్కనే ఆగివున్న లారీని ఢీకొని తీవ్రంగా గాయాలపాలయ్యింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్ఐ ప్రసాద్ తన స్నేహితులతో కలిసి తీవ్రంగా గాయపడ్డ యువతిని తన కారులో ఎక్కించుకుని పక్కనే ఉన్న వైరా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం గానీ లేదా హైదరాబాద్ తరలించాల్సిందిగా సూచించారు. బాధితురాలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నట్లుగా సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించినా గంట సేపటివరకు అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకోకపోవడం బాధాకరమని ఆర్ఐ విచారం వ్యక్తం చేశారు.