ఖమ్మం రూరల్, మార్చి 10 : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం రూరల్ నివాసి మృతిచెందాడు. మండలంలోని బారుగూడెం పంచాయతీ పరిధిలో గల శ్రీసిటీలో నివాసముంటున్న పిట్టల సుధాకర్-నిర్మల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మనీశ్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తన స్నేహితుడి వివాహానికి మనీశ్ శనివారం హాజరయ్యాడు. పెళ్లి వేడుక అనంతరం ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో తిరిగి వస్తుండగా ఆళ్లగడ్డ వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో మనీశ్ (31) అక్కడికక్కడే చనిపోయాడు. మనీశ్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. మృతుని తండ్రి సుధాకర్ ఆర్టీసీలో ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్‌లో క్రియాశీలక వ్యక్తి. మృతదేహం మంగళవారం ఖమ్మంకు చేరుకుంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.