దమ్మపేట, జనవరి 18 : అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల మధ్య గుడారాలు వేసుకున్న పలు కుటుంబాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో వారు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాటలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. ఈ ఘటన దమ్మపేట మండల కేంద్రంలోని మల్లారం కాలనీలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చిరు వ్యాపారాల నిమిత్తం పలు కుటుంబాలు దమ్మపేటకు వచ్చి అద్దెకు ఉంటూ ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్నాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పడం.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు ఎన్నికలు రావడంతో మధ్యలోనే నిలిచిపోవడం.. దీంతో ఇళ్లు లేని నిరుపేదలు గత పది రోజులుగా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణ ప్రాంతంలో గుడారాలు వేసుకుని ఉంటున్నారు. వారంతా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను ఆక్రమించారని ఆరోపిస్తూ పోలీసులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది వారి గుడారాలను తొలగించేందుకు పూనుకున్నారు. దీంతో పలువురు మహిళలు, యువకులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
గుడారాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగిస్తుండగా అడ్డువచ్చిన మహిళలను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. తోపులాటలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోగా ఆమెను పోలీసు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. విధి నిర్వహణలో తమను అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సాయికిశోర్రెడ్డి, తహసీల్దార్ వాణి తెలిపారు. కాగా.. అధికారులు ఆక్రమణదారులనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లు అందించేందుకు కృషి చేస్తున్నదని, మీరంతా దరఖాస్తు చేసుకుంటే అర్హులైన వారికి ఇళ్లు కేటాయిస్తారని తెలిపారు. ఇలా ఆక్రమణలకు పాల్పడొద్దని, అధికారుల విధులను అడ్డుకోకుండా సంయమనం పాటించాలని సూచించారు. మరోవైపు తాము నివసిస్తున్న గుడారాలను తొలగిస్తే మా పరిస్థితి ఏమిటని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.