నవరాత్రులు తీరొక్క పూజలందుకున్న గణనాథులకు ఉమ్మడి జిల్లా ప్రజలు వీడ్కోలు పలికారు. గురువారం రెండో రోజు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన మండపాల నిర్వాహకులు, మహిళలు.. విఘ్నేశ్వరుడి విగ్రహాలను ముస్తాబు చేసిన వాహనాలపైకి చేర్చి శోభాయాత్రకు పయనమయ్యారు. డీజే మోతలు, మేళతాళాల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ యాత్ర అగ్రభాగాన సందడి చేశారు. జై గణేశా.. జైజై గణేశా.. అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జన ప్రాంతానికి చేర్చిన గణనాథుడి విగ్రహాలను సమీపంలోని మున్నేరు వాగు, చెరువులు, కుంటలు, భద్రాచలం గోదావరి వద్ద నీటిలో నిమజ్జనం చేశారు. కొత్తగూడెం, పాల్వంచ, బోనకల్, చింతకాని, ముదిగొండ, తిరుమలాయపాలెం, పెనుబల్లి, వేంసూరు, కొణిజర్ల, అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, ఆళ్లపల్లి, జూలూరుపాడు మండలాల్లో గణేశ్ నిమజ్జన వేడుకలను భక్తిప్రపత్తులతో నిర్వహించారు.
-నమస్తే నెట్వర్క్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గణేశ్ నిమజ్జనం రెండో రోజు కొనసాగింది. గురువారం ఉదయమే మండపాల్లో గణనాథుడి విగ్రహాల వద్ద పూజలు చేసిన భక్తులు అలంకరించిన వాహనాలపై నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్రలో మేళతాళాలు, డీజే మోతల నడుమ దారి పొడవునా యువకులు నృత్యాలు చేస్తూ.. కోలాటాలు ఆడుతూ.. కుంకుమలు చల్లుకుంటూ ‘జైజై వినాయకా.., జైజై గణపయ్యా..’ అంటూ నినాదాలు చేశారు. భద్రాచలంలోని గోదావరి నది, గ్రామాల్లోని సమీప చెరువులు, వాగుల వద్ద నీటిలో గణపయ్యను నిమజ్జనం చేసి వీడ్కోలు పలికారు.
Khammam3