ఖమ్మం, జనవరి 18 : ఉద్యమ గుమ్మంపై జన అభిమానం ఉప్పొగింది. చైతన్యపు జిల్లా.. కమ్యూనిస్టులు ఏలినగడ్డ.. మూడురంగుల జెండా పాలించిన నేలపై గులాబీ జెండా నూతన చరిత్రను సృష్టించిన రోజు 18-1-2023. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత చరిత్రలో ఏ రాజకీయ పార్టీ సభలకు రానంత జనం వచ్చా రు. ఖమ్మంలో బుధవారం నూతన కలెక్టరేట్ పక్కన జరిగిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తొలి సభకు లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఖమ్మంలో ఏమైనా జాతర జరుగుతున్నదా అన్నట్లు ఖమ్మం జిల్లా చరిత్రలో బహిరంగ సభ నూతన అధ్యయాన్ని లిఖించింది. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ర్టాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని సభకు హాజరయ్యారు. లక్షలమంది హాజరుకావడంతో సభా ప్రాంగణం హోరెత్తింది. ఇంకా లక్షలాది మంది జనం సభావేదిక వద్దకు చేరుకోలేక రోడ్లపైనే వేచి ఉన్నారు. వేలాది వాహనాలు సభావేదిక ప్రాంతానికి చేరుకోలేక ఖమ్మం నగరం చుట్టూ 30 కిలోమీటర్ల మేరలో నిలిచిపోయాయి. ప్రజలు అక్కడ నుంచి నడక మార్గంలో వేదిక వద్దకు చేరుకున్నారు.
ఉదయం 9గంటల నుంచే జనం రాక
రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలతో బీఆర్ఎస్ సభా ప్రాంగణం ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 9గంటల నుంచే ప్రాంగణానికి చేరుకున్నారు. లక్ష మందికి ఏర్పాటు చేసిన కుర్చీల్లో ప్రజలు ఆశీనులయ్యారు. వారందరినీ వలంటీర్లు గ్యాలరీల్లో కూర్చోబెట్టి మంచినీటి ప్యాకెట్లను అందించారు. సభా ప్రాంగణానికి రెండు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేయడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు ఇబ్బంది కలుగలేదు. బీఆర్ఎస్ వలంటీర్లు, పోలీసులు ప్రజలను గ్యాలరీల వైపు వెళ్లాలని చూపించారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ స్టేజీ పరిపూర్ణంగా కనిపించడంతోపాటు, ప్రతి గ్యాలరీలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో ఇబ్బంది జరుగలేదు. 50ఎల్ఈడీ స్క్రీన్లు, 70 మొబైల్ టాయిలెట్స్, సభా ప్రాంగణంలో ప్రజలకు ఇబ్బంది కాకుండా 20 గ్యాలరీల్లో 50 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
మండుటెండనూ లెక్కచేయని ప్రజలు
మండుటెండనూ లెక్కచేయకుండా జనం సభను వీక్షించారు. ఉదయం 9గంటల నుంచి ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ మహిళలు, పురుషులు పెద్దసంఖ్యలో హాజరై సీఎం ప్రసంగం పూర్తి అయ్యేంత వరకు కదలలేదు. వలంటీర్లు ఎప్పటికప్పడు మంచినీటి ప్యాకెట్లను జనానికి అందజేశారు. కొన్నిచోట్ల వారి నియోజకవర్గ శాసనసభ్యులు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు.
వీఐపీలకు ప్రత్యేక మార్గం
సభా ప్రాంగణానికి చేరుకునేందుకు వైరా రోడ్డు నుంచి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు తదితరులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీకి ఈ మార్గం గుండా వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. ఇదేమార్గంలో మీడియా ప్రతినిధులను అనుమతించడంతో సభ ప్రశాంతంగా ముగిసింది.
ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 18: బీఆర్ఎస్ సభలో ఉత్సాహం ఉరకలేసింది.. కేసీఆర్‌పై ప్రజాభిమానం ఉప్పొంగింది. జనకెరటం ఉవ్వెత్తున ఎగిసింది. వెరసి ఖమ్మం గుమ్మం జనసంద్రమైంది. మొత్తానికి సభ గ్రాండ్ సక్సెస్ అయింది. సీఎం కేసీఆర్ రాక కోసం బుధవారం ఉదయం నుంచి పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎదురుచూశారు. సభకు వచ్చిన వారితో సభాస్థలి నుంచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సభకు జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాలైన భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుంచి లక్షలాది మంది తరలిరావడంతో ప్రధాన మార్గాలన్నీ వాహనాలతో కిటకిటలాడాయి.
కేసీఆర్ ప్రసంగానికి విశేష స్పందన
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా సభాప్రాంగణం ‘జై కేసీఆర్.. జై భారత్’ నినాదాలతో హోరెత్తింది. ఆయన ప్రసంగం ఆద్యంతం ఉత్తేజంగా సాగింది. బీజేపీ ప్రభుత్వ దుర్మార్గ పాలనపై సందర్భానుసారంగా విసిరిన చెణుకులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. 2024 తర్వాత ‘నువ్వు ఇంటికి.. మేం ఢిల్లీ పీఠం ఎక్కి మీరు అమ్మిన ప్రభుత్వ రంగ సంస్థలను వెనక్కి తెస్తాం..’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల్లో జోష్ నింపాయి.
వేలాదిగా తరలివచ్చిన మహిళలు
మహిళా సాధికారత కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు పేదింటి ఆడపిల్లల వివాహాలకు వరమయ్యాయి. గర్భస్థ సమయంలో కూలి కోల్పోయే గర్భిణులకు సర్కార్ అండగా నిలుస్తున్నది. ‘కేసీఆర్ కిట్’ అందజేస్తున్నది. గర్భిణులకు ఆడశిశువు జన్మిస్తే రూ.13 వేలు, మగశిశువు జన్మిస్తే రూ.12 వేలను విడతల వారీగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నది. డ్వాక్రా రుణాలతో ఎంతోమంది మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆ అభిమానంతోనే వేలాది మంది మహిళలు బీఆర్ఎస్ సభకు తరలివచ్చారు. సీఎం మాట్లాడుతున్నంతసేపు యువత కేరింతలు కొడుతూ సందడి చేశారు.
నాయకుల జోష్..
సభ నిర్వహణకు ముందే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి, సభ ఇన్చార్జి హరీశ్‌రావు సన్నాహక సమావేశాలు నిర్వహించడం సత్ఫలితాలనిచ్చింది. సభకు జనం నుంచి అనూహ్య స్పందన రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నిండింది. ప్రజలు సభకు తరలివచ్చి బీఆర్ఎస్కు మరోసారి మద్దతు ఇస్తారనే సంకేతాలు వెలిబుచ్చడం బీఆర్ఎస్ నాయకులకు ధీమానిచ్చింది. దీంతో నాయకులు, కార్యకర్తలతో సరికొత్త జోష్‌తో తిరిగి స్వస్థలాలకు వెళ్లారు.