ఖమ్మం మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఖమ్మానికి మెడికల్ కాలేజీ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలెన్నో మారాయి.. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు.. వినతులన్నీ బుట్టదాఖలయ్యాయి. కానీ.. తెలంగాణలో పేదల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఖమ్మానికి మెడికల్ కాలేజీ కేటాయింపుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
‘సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఖమ్మానికి మెడకల్ కాలేజీని మంజూరు చేస్తున్నాం..’ అని అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తూ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రకటించారు. అవసరమైన నిధులూ వార్షిక బడ్జెట్లో కేటాయించడం గమనార్హం. ఇప్పటికే ప్రతిపాదనలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్యమంత్రికి వివరించి సానుకూల ఫలితాల సాధనలో కీలకపాత్ర పోషించారు. ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు అనుబంధంగా మెడికల్ కళాశాల నెలకొల్పనున్నారు. ప్రతిరోజూ వెయ్యి మందికి సేవలు అందిస్తూ, మూడు దఫాలు కాయకల్ప అవార్డును కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన పెద్దాసుపత్రికి ఈ కాలేజీ మణిహారంగా మారబోతున్నది. ప్రస్తుతం దవాఖానాలో 13రకాల వైద్య సేవలు అందుతున్నాయి. కాలేజీ ఏర్పాటుతో అనేక రకాల విభాగాలు అందుబాటులోకి వస్తాయి.
పెద్దాసుపత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటుతో జిల్లాలోని లక్షలాది మంది నిరుపేదల ఆరోగ్యానికి పూర్తి భరోసా లభించనున్నది. ఐసీయూ బెడ్ల సంఖ్య పెరగడంతోపాటు అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా అనాటమీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్, ఫాథాలజీ, మైక్రో బయాలజీ వంటి కీలక సేవలను 24 గంటల పాటు నయాపైసా ఖర్చులేకుండా పొందవచ్చు. వీటిల్లో ఫోరెన్సిక్ అతి ముఖ్యమైనదిగా వైద్యాధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు పోస్టుమార్టం ఇక్కడే చేసినప్పటికీ వాటి ఫలితాల కోసం వరంగల్‌కు వెళ్లాల్సి వచ్చేది. దీంతో అనేక కేసుల్లో తీవ్ర జాప్యం నెలకొని బాదితులు ఇబ్బందులకు గురయ్యేవారు. మెడికల్ కళాశాల స్థాపనతో పోస్టుమార్టం విభాగంలో మార్పులు వస్తాయి.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఖమ్మం పెద్దాసుపత్రికి మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. కేవలం ఏడేండ్లలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం దశాబ్దాల సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ వస్తున్నది. జనరల్ వార్డుకు అనుసంధానంగా కార్పొరేట్‌ను తలదన్నే రీతిలో మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది. దవాఖాన ప్రాంగణంలో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్, క్యాథ్లాబ్, డయాలసిస్ వంటి ఖరీదైన వైద్యాన్ని సాధారణ ప్రజలకు పరిచయం చేసింది. వీటితోపాటు వైద్యసేవల కోసం ఆసుపత్రిలో చేరే ఇన్ పేషెంట్స్‌కు రుచికరమైన పౌష్టికాహారాన్ని వడ్డించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. మెడికల్ కాలేజీ ఏర్పడిన తర్వాత నాణ్యమైన భోజనం అందనున్నది.
తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం గ్రామ సమీపాన సమీకృత కలెక్టరేట్ నిర్మాణం జోరుగా సాగుతున్నది. వచ్చే దసరా నాటికి ప్రారంభించాలనే ఉద్దేశంతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. ఖమ్మానికి మెడికల్ కళాశాలను మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ సర్కార్ కీలక ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కళాశాల, బోధనా తరగతులకు సంబందించి పాత కలెక్టరేట్ భవనాన్ని కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను సైతం ప్రభుత్వానికి పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. పాత కలెక్టరేట్, జడ్పీ, ఆర్అండ్బీ కార్యాలయాలకు చెందిన భవనాలన్నీ సమీకృత కలెక్టరేట్‌లోకి వెళితే వాటన్నింటినీ మెడికల్ కళాశాలకు కేటాయించే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పడం గమనార్హం.
ఇంతింతై వటుడింతై అన్న సామెత ఖమ్మం పెద్దాసుపత్రికి వందశాతం వర్తిస్తుంది. తొలుత ఖమ్మం రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఆస్పత్రి ఆ తర్వాత 1968లో 100 పడకలతో ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి మారింది. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభమైన దవాఖాన 1984లో 230 పడకలకు మారింది. నాటి నుంచి అనేక సమస్యలతో కునారిల్లుతూ వచ్చిన ఆసుపత్రికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత మహర్దశ పట్టింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ తీసుకుని మెడికల్ కళాశాల మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్‌కు జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఖమ్మం జిల్లాంలోని దవాఖానకు అనుసంధానంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మొట్టమొదటిసారిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. కళాశాల కోసం కృషి చేసిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ధన్యవాదాలు. మెడికల్ కాలేజీ రాకతో పేదల ఆరోగ్యానికి భరోసా లభించనుంది. అన్నిరకాల అత్యున్నత ప్రమాణాలు కలిగిన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
– డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్
ఖమ్మానికి మెడికల్ కాలేజీ కేటాయింపు జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం. ప్రధానంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అనేకరకాలుగా మారుతుంది. కొత్తగా అనేక రకాల విభాగాలు, యూనిట్లు వస్తాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, దాదాపు 150 మంది మెడికల్ విద్యార్థులు, పీజీ చదివే వైద్యులు నిరంతరం దవాఖానలో పనిచేస్తుంటారు. కాలేజీకి అనుసంధానంగా నర్సింగ్ కళాశాల మంజూరవుతుంది. దీంతో నిఫుణుల, నర్సుల కొరత తీరుతుంది. కీలకమైన వైద్య పరీక్షలు ఇక్కడే జరుగుతాయి. జిల్లా ప్రజలందరికీ నాణ్యమైన వైద్యసేవలు లభిస్తాయి.
– డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, ఆర్ఎంవో