వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేసి కొత్త చరిత్రను సృష్టించింది. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి అనుసంధానంగా ప్రభుత్వం మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. పాత కలెక్టరేట్ భవనాన్ని రూ.8.5కోట్ల వ్యయంతో కళాశాల కోసం ఆధునీకరించింది. వైద్య కళాశాలను సీఎం కేసీఆర్ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హైదరాబాద్ నుంచి గురువారం ఉదయం వైద్య కళాశాలకు చేరుకొని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. తర్వాత మమత హాస్పిటల్ ప్రాంగణంలో సిల్వర్ జూబ్లీ భవనాన్ని ప్రారంభిస్తారు. మాజీ ఎమ్మెల్యే, మమత వైద్య విద్యా సంస్థల ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం పాలేరు నియోజకవర్గం మద్దులపల్లిలో నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ఖమ్మం, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు ఎనిమిది ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఖమ్మం ప్రధానాసుపత్రికి అనుసంధానంగా నూతన మెడికల్ వైద్యశాల రూపుదిద్దుకున్నది. మెడిసిన్ తరగతులకు నగరంలోని పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ, జిల్లా వైద్యారోగ్యశాఖ భవనాలు రూ.8.5 కోట్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వీటి పరిధిలో పరిపాలన విభాగం, లైబ్రరీ, పరీక్షా కేంద్రాలు, టీచింగ్ హాల్స్, మ్యూజియం, బయో కెమిస్ట్రీ, క్లినికల్ ఫిజియాలజీ, హెమటాలజీ, అంఫిబియా ల్యాబ్స్, డిసిక్షన్, లెక్చరర్ హాల్స్, బయోకెమిస్ట్రీ, అనాటమీశాఖలు, విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్స్ అందుబాటులోకి వచ్చాయి. కళాశాలకు ఫర్నీచర్, కంప్యూటర్స్, లైటింగ్‌తోపాటు ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు ఇప్పటికే సమకూరాయి. విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఆరుగురు ప్రొఫెసర్లు, ఐదుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతోపాటు ఇతర సిబ్బంది నియమితులయ్యారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షణలో సకాలంలో పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
కళాశాలను పరిశీలించనున్న మంత్రి హరీశ్‌రావు..
మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్,ఎంపీలు నామా, వద్ది రాజు పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాలేజీని పరిశీలించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో హెలికాఫ్టర్ బయల్దేరి 10 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. మెడిసిన్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు. వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొని మమత హాస్పిటల్‌కు చేరుకుంటారు. ఆసుపత్రి ప్రాంగణంలో ‘సిల్వర్ జూబ్లీ’ భవనాన్ని ప్రారంభిస్తారు. తర్వాత మమత వైద్య, విద్యా సంస్థల ఫౌండర్, సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయల్దేరి మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మద్దులపల్లిలో నిర్మించనున్న నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రుల పర్యటనకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..
మెడికల్ కళాశాల ఇప్పటికే నేషనల్ మెడికల్ కౌన్సిల్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి పూర్తిస్థాయి అనుమతులు పొందింది. ఇటీవల వంద సీట్ల భర్తీకి అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. కళాశాలను సీఎం కేసీఆర్ ఈనెల 15న హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. మరుసటి రోజు నుంచి విద్యార్థులకు వారం రోజుల పాటు అవగాహన తరగతులు జరుగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో తరగతులు ప్రారంభం కానున్నాయి.
మమత ‘సిల్వర్ జూబ్లీ బ్లాక్’
ఉమ్మడి జిల్లా ప్రజలకు 25 ఏళ్లుగా వైద్య సేవలందిస్తున్న మమత వైద్య కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమైంది. మమత సూపర్ స్పెషాలిటీ వైద్య కళాశాల ఆవరణలో అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన సిల్వర్ జూబ్లీ బ్లాక్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. దీనిని గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించనున్నారు. ఖమ్మంలో 1998లో 100 పడకల ఆస్పత్రిగా నెలకొల్పిన మమత వైద్యశాల దినదినాభివృద్ధి చెందుతూ రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తోంది.
వైద్య సేవలు అందిస్తూనే.. వైద్య కళాశాలను ఏర్పాటు చేసిన యాజమాన్యం 2003లో తొలిబ్యాచ్‌ను పాస్ అవుట్ చేసింది. ఈ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు దేశ విదేశాల్లో సేవలు అందిస్తూ మమత కళాశాల ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్నారు. 2003లో మమత మెడికల్ పీజీ కళాశాలను సైతం 55 సీట్లతో ప్రారంభించి ఇంతింతై వటుడింతై అన్నట్లు విస్తరిస్తోంది. క్రమేణా 2006-07లో 150 సీట్లకు అప్‌గ్రేడ్ అయ్యింది. పీజీ 104 సీట్లకు అనుమతులు సాధించింది. 2022-23 నాటికి 200 ఎంబీబీఎస్ సీట్లతో పెద్ద వైద్య కళాశాలగా పేరొందింది. ఇప్పటివరకు 20 బ్యాచ్‌లకు పైగా 2,500 మంది ఎంబీబీఎస్, 18 బ్యాచ్‌లతో 1,200 మందికి పైగా పీజీ విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దింది. మమత విద్య, వైద్య కళాశాల మొత్తం 23 విభాగాల్లో ఎండీ, ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా సేవలు అందిస్తోంది. కాగా.. మమత విద్యా, వైద్యశాలల సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ప్రాంగణంలో నిర్మించిన సిల్వర్ జూబ్లీ బ్లాక్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.