వినాయక చవితి రోజు ప్రతిష్టించిన నాటి నుంచి తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న గణనాథులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఉదయం గణపయ్యలు కొలువుదీరిన మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు స్వామివారికి నైవేద్యం సమర్పించారు. మధ్యాహ్నం అలంకరించిన వాహనాలపైకి స్వామివారిని చేర్చి డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, డీజే మోతల నడుమ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా గణనాథుడి శోభాయాత్ర నిర్వహించారు. యాత్రలో భాగంగా ఇళ్ల ముంగిళ్లకు చేరిన గణపయ్యలకు మహిళలు హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 6 : ‘గణపతి బొప్పా మోరియా.. జైజై గణేశా.. జై భోలో గణేశ్ మహరాజ్‌కీ జై’ అంటూ కేరింతలు కొడుతూ కుంకుమ చల్లుకుంటూ యువతీ యువకులు నినాదాలు చేశారు. భద్రాచలం గోదావరి నదిలో, ఖమ్మంలోని మున్నేరు వాగులో భక్తిశ్రద్ధల నడుమ వినాయక ప్రతిమలను ఘనంగా నిమజ్జనం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఖమ్మంలో సీపీ సునీల్‌దత్, భద్రాచలంలో ఎస్పీ రోహిత్‌రాజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు
భద్రాచలం గోదావరి తీరంలో నిమజ్జనానికి తరలిస్తున్న గణపతి విగ్రహాలు
భద్రాచలం గోదావరి వద్ద నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ
ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ మీదుగా కొనసాగుతున్న గణేశ్ శోభాయాత్ర