రాష్ట్ర శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెసేతర రాజకీయ పక్షాల నేతలు, ప్రజలు, రైతులు పెదవివిరిచారు. పాత విషయాన్ని కొత్తగా చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందే తప్ప.. ప్రజల కష్టాలు, కన్నీళ్లను తీర్చేవిధంగా ఈ బడ్జెట్ ఎంతమాత్రమూ లేదని వ్యాఖ్యానించారు. పేదలకు, సంక్షేమ రంగానికి పూర్తిస్థాయిలో మేలుచేసేలా లేదని ఈ బడ్జెట్ లేదని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ పేరుతో ఉమ్మడి జిల్లా ప్రజలకు ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చిందని, ఏ మాత్రమూ ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకోలేదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యానించారు. ప్రతీ రంగానికి, ప్రతీ వర్గానికి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలకే ఆ ప్రభుత్వం మంగళం పాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. వ్యవసాయం, విద్య, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి రంగాలకు కేటాయించిన నిధులు ఎంతమాత్రమూ సరిపోవని స్పష్టం చేశారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజల ఆశలను, అవసరాలను ప్రతిబింబించలేకపోయిందని బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
-ఖమ్మం, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బడ్జెట్లో కేటాయింపులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశాయి. విద్య, సంక్షేమం, సాగునీటి రంగాల్లో పెద్దపీట లభిస్తుందని భావించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు.. ప్రభుత్వం ప్రత్యేక కేటాయింపులు ఏమీచేయకుండా రిక్తహస్తం చూపింది. లక్షలాది ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. నిధులను వరదలా పారించారు. అయితే, ప్రాజెక్టు పనులు కొలిక్కివస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.19 వేల కోట్లకు రూపొందించింది. అయినా అందుకు తగినట్లుగా బడ్జెట్లో నిధుల కేటాయింపు మాత్రం జరగలేదు. దీంతో రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది. నిరుడు ఆగస్టు 15న వైరాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. 2026 ఆగస్టు నాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే అత్తెసరు నిధులే విదిల్చినట్లుగా ఉంది. దీంతో ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఏడాదిలోనే పూర్తిచేయగలదన్న నమ్మకం రైతుల్లో సన్నగిల్లింది. సీతారామ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేయగా మరో రూ.12 వేల కోట్లను ప్రభుత్వ అంచనా వ్యయం ప్రకారం ఖర్చుచేస్తే తప్ప ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ఈ ఏడాది రూ.5 వేల కోట్లు ఈ సంవత్సరం అవసరం ఉండగా కేవలం రూ.699 కోట్లు మాత్రమే కేటాయించడంతో ప్రాజెక్టు పనులు మరింత నత్తనడక నడిచే ప్రమాదం ఉందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ లభిస్తుందని ఆశించిన విద్యార్థులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. గ్రామీణ ప్రాంతాల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టనేలేదు. మౌలిక సదుపాయాల కల్పనకు అనుకున్న స్థాయిలో నిధులు లేవు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు, కాలువల ఆధునీకరణ పనులు, విద్య, వైద్య శాఖల భవనాలు, మెడికల్ కళాశాల నిర్మాణానికి అవసరమైన నిధులు లభిస్తాయని ఆశించిన ప్రజలకు అసంతృప్తే మిగిలింది. సీతమ్మసాగర్ బ్యారేజ్‌కు ఎదురుచూపులు తప్పేలాలేవు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది దివాళాకోరు బడ్జెట్. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్. బడ్జెట్ అంతా ఢిల్లీకి మూటలు పంపించే విధంగా ఉంది. ఆరు గ్యారెంటీలతోపాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచేలా ఉంది. పేదల సంక్షేమాన్ని విస్మరించి.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పేక మేడల్లా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూల్చింది. దళితులు, బీసీలకు అన్యాయం చేసేలా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ.
-వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, కొత్తగూడెం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అందరికీ, అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు సైతం నిధుల కేటాయింపు జరగలేదు. రైతులు, నిరుద్యోగులు, దివ్యాంగులు, వృద్ధులకు అన్నింటా అన్యాయం చేసింది. కాగితాలపై అంకెలు చూపిస్తూ సర్కారు గారడీ చేసినట్లుగా ఉంది బడ్జెట్.
– మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెలు, కేటాయింపులు ఘనంగానే కనిపించినా పాత బడ్జెట్ తరహాలోనే కొత్త మాటలతో ఉంది. ఆరు గ్యారెంటీలకు అనుగుణంగా లేదు. ఎన్నికల వాగ్ధానాలను బడ్జెట్లో విస్మరించారు. నిరుద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి ఊసేలేదు. విద్యారంగానికి గత ఏడాది కంటే స్వల్పంగా పెంచి చేతులు దులుపుకున్నారు. 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థాపన, వాటికి కేటాయింపుల గురించి ఘనంగా ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరగలేదు. వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించలేదు. రైతు భరోసా, రుణమాఫీ కేటాయింపు నిధులు సరిపోవు. నీటిపారుదల రంగానిదీ అదే పరిస్థితి. భట్టి బడ్జెట్ మాటలు ఘనం.. కేటాయింపులు స్వల్పం. రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్.
-పోటు రంగారావు, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మధ్యంతర, రెండు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టినా అంకెల గారడీ తప్ప ప్రజలకు కొత్తగా ఒరిగిందేమీ లేదు. జ్యోతిరావు పూలే పేరుతో రూ.20 వేల కోట్ల సబ్‌ప్లాన్ కోసం బీసీలు గొంతెత్తి డిమాండ్ చేస్తే.. రూ.11,405 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. నేతన్నల సంక్షేమం విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని తేలిపోయింది. కేవలం రూ.371 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఈ బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదు. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలపై నీళ్లు చల్లే విధంగా ఉంది.
-వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
బడ్జెట్ అంకెల గారడీలా ఉంది. అన్ని రంగాలకు అన్యాయం జరిగింది. వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ కేవలం లెక్కలకే అన్నట్లుగా ఉంది. రైతులకు న్యాయం చేస్తారనే నమ్మకం లేదు. ఆటో కార్మికులు, యాదవుల గురించి ప్రస్తావించలేదు. వైన్స్ షాపుల్లో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామన్న హామీపై ప్రస్తావన లేదు. దళితులను మోసం చేసింది. నిరుద్యోగులకు ఒక్క హామీ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి గురించి ఒక్కమాట కూడా ప్రస్తావించలేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పేకమేడలా కుప్పకూల్చారు. ట్రిలియన్ డాలర్‌కు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియని దరిద్రపు సర్కార్ కాంగ్రెస్‌ది.
-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
కాంగ్రెస్ బడ్జెట్లో ఆరు గ్యారెంటీలకు మంగళం పాడి అరచేతిలో వైకుంఠం చూపించింది. ఎన్నికల హామీలను విస్మరించింది. ప్రతి రంగానికి, అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచింది. 40 శాతం కమీషన్ల కోసమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లుగా స్పష్టమైంది. ఆటో డ్రైవర్ మొదలుకొని అన్నదాత వరకు అందరినీ మోసం చేసింది. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్‌ను తీసుకెళ్లింది. మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీలను ప్రస్తావించలేదు. తులం బంగారం ప్రస్తావన లేదు. చేనేతకు మా హయాంలో రూ.1,200 కోట్లు కేటాయిస్తే.. ఈ బడ్జెట్లో కేవలం రూ.300 కోట్లకే పరిమితం చేశారు.
– ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్
కాంగ్రెస్ అసమర్థ పాలనకు ఈ బడ్జెట్ నిలువెత్తు నిదర్శనం. ఇచ్చిన హామీలకు కనీస కేటాయింపు లేకపోతే హామీలు ఇవ్వడం ఎందుకు? బీసీలకు కేవలం భిక్ష వేసినట్లు రూ.11,405 కోట్లు మాత్రమే ఇచ్చి బీసీల గొంతు కోశారు. ఆరు గ్యారెంటీలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచే బడ్జెట్ ఇది. ఆటోవాలా మొదలుకొని అన్నదాత వరకు అందరికీ అన్యాయమే జరిగింది. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు అంతంతమాత్రమే. బడ్జెట్ అంతా అరచేతిలో వైకుంఠంలా ఉంది. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రతీ ఒక్కరూ పెదవి విరుస్తున్నారు.
-రేగా కాంతారావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర బడ్జెట్లో భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించలేదు. ఏజెన్సీ ప్రాంతాలకు గోదావరి నీళ్లు ఇచ్చేందుకు, ఇల్లెందు నియోజకవర్గానికి నీళ్లు వచ్చేలా పనుల కోసం బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ఆశపడ్డాం. కానీ.. ఆ ఊసేలేదు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా సీతారామ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం సరికాదు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు నిధుల కేటాయింపు జరగలేదు. కేసీఆర్ రైతుల కోసం, పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలకూ కేటాయింపులు లేవాయె.
-బానోత్ హరిప్రియానాయక్, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉన్నవన్నీ అబద్ధాలే. రూ.2 లక్షల రుణమాఫీ అందరు రైతులకు చేశామని చెప్పడం ఇందుకు నిదర్శనం. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి.. మహిళలకు బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ తప్ప ఏవీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందొకటి.. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టింది మరొకటి. కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే.. ఆ ఉద్యోగాలు తాము ఇచ్చినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం దారుణం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఉంది.
-లింగాల కమల్‌రాజు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్