మధిర, జూన్ 25 : మొక్కలు పెంచడంలో ఖమ్మం జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం చింతకాని మండలం వందనం గ్రామంలో పర్యటించి నర్సరీని పరిశీలించారు. జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు, సంరక్షణకు చేయాల్సిన సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలని ఆదేశించారు. గతం కంటే స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. వన మహోత్సవం కార్యక్రమం కింద జిల్లాలో ప్రతి శాఖ వారికి కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు అవసరమైన ట్రీ గార్డ్ మొదలైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ప్రతి శాఖ ఏ మొక్కలు నాటుతున్నామో స్పష్టమైన రికార్డు నిర్వహించాలన్నారు. 2 మీటర్ల ఎత్తు కంటే చిన్న మొక్కలు పెట్టడానికి వీలులేదన్నారు.
మొక్కలు నాటే స్థలం ట్యాగ్ చేసి పెట్టుకోవాలన్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో లక్ష్యం చేరుకునేందుకు అవసరమైన మేర గుంతల తవ్వకం పనులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని సూచించారు. వన మహోత్సవం కార్యక్రమం క్రింద సర్వైవల్ రేట్ అధికంగా ఉండే మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలన్నారు. వార్డు అధికారులు తమ వార్డు పరిధిలో మొక్కలు నాటడం వాటి సంరక్షణకు బాధ్యతలు తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని స్వయంభు శ్రీ రామలింగేశ్వరస్వామిని కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, చింతకాని ఎంపీడీఓ, అధికారులు పాల్గొన్నారు.