ఖమ్మం, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఓటింగ్ సరళిని ఆయా కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక పర్యవేక్షించారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూముల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పరిశీలించారు. ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరగడంతో అందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వారిలో ముగ్గురు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు.
వీరి మధ్యనే గట్టి పోటీ ఉంది. మిగతా 49 మంది వివిధ రిజిస్టర్ పార్టీల అభ్యర్థులతోపాటు ఏ పార్టీలతోనూ సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 173 పోలింగ్ కేంద్రాలుండగా.. అందులో ఖమ్మం 118, భద్రాద్రి కొత్తగూడెంలో 55 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను నిర్వహించారు. సమస్యాత్మక కేంద్రాల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల లోపలి భాగాల్లో వంద శాతం సీసీ కెమెరాలు అమర్చారు.
వాటి ద్వారా ఓటింగ్‌ను విధానాన్ని ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,23,985 మంది ఓటర్లుండగా.. వారిలో 84,807 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలో 83,879 మంది ఓటర్లకు గాను.. 56,730 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 67.63 శాతం పోలింగ్ నమోదైంది. వీరిలో పురుషులు 34,847 మంది, మహిళలు 21,881 మంది, ట్రాన్స్జెండర్లు ఇద్దరు ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో 40,106 మంది ఓటర్లకు.. 28,077 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70.01 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 16,206 మంది, మహిళలు 11,871 మంది ఉన్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేసి శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించారు. ఖమ్మం సీపీ సునీల్‌దత్, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా అల్లర్లు, ఘర్షణలు వంటివి జరుగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.
పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట బందోబస్తు మధ్య తరలించారు. ఖమ్మం జిల్లాలోని బాక్సులను ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిసెప్షన్ సెంటర్‌కు, భద్రాద్రి బాక్సులను కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిసెప్షన్ సెంటర్‌కు తీసుకొచ్చారు. అనంతరం వాటిని పట్టిష బందోబస్తు మధ్య నల్గొండలోని స్ట్రాంగ్ రూముకు తరలించారు. ఈ ఎన్నికల ఫలితాలను జూన్ 5న ప్రకటించనున్నారు.