కల్లూరు, ఫిబ్రవరి 11: నిరుపేదల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు పడే ఆర్థిక ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కుల, మతాల పట్టింపు లేకుండా అమలవుతున్న ఈ పథకాలు నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. మండలంలోని నూతనంగా వివాహాలు చేసుకున్న 113 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.1.13 కోట్ల విలువైన చెక్కులను కల్లూరు మార్కెట్ కమిటీ ఆవరణలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ రాష్ట్రంలో 10 లక్షల కల్యాణలక్ష్మి వివాహాలు దాటాయని, అన్ని పేద కుటుంబాల్లోనూ సంతోషాలు నింపాయని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 8,250 వివాహాలు జరిగాయని, లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయం అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.
కరోనా బారిన పడి పది రోజులుగా ఖమ్మంలోని తన నివాసంలో హోం ఐసొలేషన్లో ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. వైరస్ను జయించి తొలిసారిగా కల్లూరుకు రావడంతో టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మార్కెట్ కమిటీ ఆవరణలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సండ్ర చిత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లోగోలను రంగులు, పూలతో అలంకరించారు. అనంతరం కేసీఆర్, సండ్ర ఫ్లెక్సీలకు పుష్పాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీపీ బీరవల్లి రఘు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాలెపు రామారావు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, బోబోలు లక్ష్మణరావు, కీసరి వెంకటేశ్వరరెడ్డి, ఇస్మాయిల్, కాటంనేని వెంకటేశ్వరరావు, కొరకొప్పు ప్రసాద్ పాల్గొన్నారు.