పిడచగట్టుకున్న గొంతులు.. ఎండిపోయిన బావులు.. అడుగంటిన భూగర్భజలాలు.. కిలోమీటర్ల మేర కాలినడక.. చెలమలే దాహార్తి తీర్చే జలనిధులు.. ఇంట్లో శుభకార్యం చేయాలంటే ముందు నీటి గురించి ఆలోచించాల్సిన దైన్యం. అవసరమైతే వాయిదా వేసుకోవాల్సిన అగత్యం. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో ఇంటికి ఒకరిని నీళ్లు తేవడానికి కేటాయించాల్సిన పరిస్థితి. ఇదీ ఉమ్మడి పాలనలో మారుమూల గిరిజన గూడేల్లోని క‘న్నీటి’ గాథలు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తాగునీటి సమస్యలపై దృష్టి సారించారు. ప్రతిష్ఠాత్మకంగా ‘మిషన్ భగీరథ’ అమలు చేస్తున్నారు. ఇంటింటికీ శుద్ధజలం అందజేస్తున్నారు. ఇదే కోవలో పినపాక మండలంలో గ్రామీణ నీటి సరఫరా అధికారులు 63 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ జల విజయ గాథపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
– పినపాక, అక్టోబర్ 23
పినపాక, అక్టోబర్ 23 : ఉమ్మడి పాలనలో గిరిజన ప్రాంత వాసులు తాగునీటి కోసం అల్లాడిపోయారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్లు నడిచివెళ్లేవారు. వాగులు, వంకల్లో చెలిమెలపై ఆధారపడేవారు. ఇక వేసవి వస్తే వారి బాధలు వర్ణనాతీతం. ఇంట్లో శుభకార్యం చేసుకోవాలంటే ఆలోచించాల్సిన దైన్యం. గత్యంతరం లేక వేడుకలు పబ్బాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. ఖాళీ బిందెలతో ఎన్నిసార్లు రోడ్లపై రాస్తారోకోలు నిర్వహించారో లెక్కే లేదు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజల తాగునీటి కష్టాలకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ప్రతిష్ఠాత్మకంగా ‘మిషన్ భగీరథ’ అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పినపాక మండలంలోని ప్రతి పల్లెకూ శుద్ధజలం అందుతున్నది. మండల పరిధిలో మొత్తం 65 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతి గ్రామంలో ట్యాంక్లు నిర్మించారు. ఇవి గాక మరో ఐదు వలస ఆదివాసీ గ్రామాల్లోనూ బోర్లు వేశారు. సోలార్ సిస్టం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. ప్రతి రోజు 35.14 లక్షల లీటర్ల నీటిని రెండు పూటలా గ్రామస్తులకు సరఫరా చేస్తున్నారు.
నీటిలో పోషకాలు ఇలా..
మిషన్ భగీరథ నీటిలో సోడియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, క్లోరైడ్, సల్ఫైట్, నైట్రేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మనిషి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు ఈ నీరు రుచిగాను ఉంటుంది. నీరు కలుషితమైతే వానకాలంలో సాంక్రమిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటి నాణ్యతను పరిశీలించిన తర్వాతే ఇంటింటికీ నీటి సరఫరా చేస్తున్నారు. వీరితో పాటు కెమిస్ట్, మైక్రో బయాలజిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్లు నిత్యం నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తారు. పజారోగ్యాన్ని సంరక్షిస్తున్నారు.
ఇంటింటికీ శుద్ధజలం..
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిషన్ భగీరథ అమలు చేస్తున్నది. ఇంటింటికీ శుద్ధజలం సరఫరా చేస్తున్నది. ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నది. మారుమూల గిరిజన గూడేల్లోనూ పైప్లైన్లు ఏర్పాటు చేశాం. వాటర్ ట్యాంక్లు నిర్మించాం. గ్రామస్తులు అవసరమైన మేరకే నీళ్లు పట్టుకోవాలి. నీటిని వృథా చేయరాదు.
– విజయకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, పినపాక
రెండు పూటలా నీటి సరఫరా..
ఉప్పాక గ్రామస్తులకు ప్రతిరోజు రెండు పూటలా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం. ఇప్పుడు వేసవిలోనూ నీటి ఎద్దడి లేదు. మిషన్ భగీరథ తాగునీటి కష్టాలను దూరం చేసింది. వేసవి వస్తే నీటి వసతి లేక గ్రామంలో శుభకార్యాలు కూడా జరిగేవి కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఆనందంగా శుభకార్యాలు చేసుకుంటున్నాం.
– పూనెం సుజాత, సర్పంచ్, ఉప్పాక
తాగునీటి కష్టాలు తీరాయి..
గతంలో తాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డాం. గుక్కెడు నీరు తెచ్చుకోవడానికి పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చేది. ఇక ఎండాకాలం వస్తే మా కష్టాలు వర్ణనాతీతం. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిషన్ భగీరథ ద్వారా మాకు శుద్ధజలం అందుతున్నది. స్వచ్ఛమైన గోదావరి నీరు తాగుతున్నాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో పైప్లైన్లు, వాటర్ ట్యాంక్లు ఏర్పాటయ్యాయి. తాగునీటి కష్టాలు తీరాయి.
– గోనె లక్ష్మి, గ్రామస్తురాలు, ఉప్పాక