ఖమ్మం/ రఘునాథపాలెం/ ఖమ్మం వ్యవసాయం/ మామిళ్లగూడెం/ ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 8: మానవ మనుగడకు మూలం మహిళ అని వక్తలు ఉద్ఘాటించారు. స్త్రీమూర్తి లేకుంటే సమాజమే లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్, సంఘాలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మహిళాబంధు సంబురాల్లో భాగంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని తెలంగాణ భవన్లో, మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉమెన్స్‌డే కేక్‌లు కట్ చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలను సన్మానించారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు కేక్ కట్ చేసి మహిళా ప్రజాప్రతినిధులకు తినిపించారు. అనంతరం ఆశ కార్యకర్తలను సన్మానించారు. క్రీడల విజేతలకు మెమెంటోలు అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, అనేక పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. మంత్రి అజయ్ క్యాంపు కార్యాలయంలో మేయర్ నీరజ, డిప్యూట్ మేయర్ ఫాతిమా, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, శోభారాణి కట్ చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు మాట్లాడారు.