ఖమ్మం సెప్టెంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ వానకాలంలో రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రణాళిక ఖరారు చేసింది. ఖమ్మం జిల్లాలో 252 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ వానకాలంలో 1,15,518 హెక్టార్లలో వరి సాగు చేశారు. హెక్టార్‌కు 5,681 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని, జిల్లాలో మొత్తం 6,56,258 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని వ్యవసాయ, పౌర సరఫరాల అధికారుల అంచనా. ఇందులో స్థానిక అవసరాలకు 86,258 మెట్రిక్ టన్నులు, సీడ్ కోసం మరో 20 వేల మెట్రిక్ టన్నులు పోగా.. మిగిలిన 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది. దీనిలో మిల్లర్లు నేరుగా 50వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 252 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 5లక్షల టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా జిల్లా అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు.
252 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
ఈ వానకాలం జిల్లాలో 252 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఐకేపీ 67, పీఏసీఎస్ 151, డీసీఎంఎస్ 30, ఏఎంసీ 4, మొత్తం 252 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. నవంబర్ మొదటి వారంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ లోపు సిబ్బందికి కొనుగోళ్లపై శిక్షణ పూర్తి చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్లు నవంబర్ నాటికి 2.20 లక్షల మెట్రిక్ టన్నులు, డిసెంబర్లో 2.07 లక్షల మెట్రిక్ టన్నులు, వచ్చే ఏడాది జనవరిలో 1.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసేలా ప్రణాళిక ఖరారు చేశారు.
గన్నీ సంచులు సిద్ధం
ఈ వానకాలం ధాన్యం కొనుగోళ్లకు కోటి 25 లక్షల గన్నీ బ్యాగులు అవసరం. ప్రస్తుతం జిల్లాలో 62 లక్షల 59 వేల 650 గన్నీ సంచులు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 40 లక్షల 80వేల 341గన్నీ బ్యాగులను వివిధ రూపాల్లో సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో ఒక్కసారి ఉపయోగించిన గన్నీ సంచులు, రేషన్ దుకాణాల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అక్టోబర్‌లో శిక్షణ ఇచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాగా ప్రభుత్వం వరి ధాన్యం గ్రేడ్-ఏ రకం క్వింటాకు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 మద్దతు ధర అందిస్తున్నది. వరి కోతలు ముందుగానే ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ కోసం తరలించనున్నారు. రైస్ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ చేయిస్తే నూకల శాతం అధికంగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో ఒక లారీకి సరిపడా ధాన్యం బస్తాల తూకం పూర్తయిన వెంటనే కస్టమ్ మిల్లింగ్ కోసం తరలిస్తారు. ఈ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడతాయి.
అక్రమాలకు తెర..
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయకముందు మార్కెట్లో వ్యాపారులదే రాజ్యం. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి వారు నిర్ణయించిన ధరకే రైతులు ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి. దీంతో గత్యంతరం లేక వచ్చిన ధరకే విక్రయించి నష్టపోయేది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో మార్కెట్లో ధాన్యం ధరలు పెరిగి రైతులకు మేలు జరుగుతున్నది.
5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం
ఖమ్మం జిల్లాలో ఈ వానకాలం 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళిక రూపొందించాం. వివిధ శాఖల ఆధ్వర్యంలో 252 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. ప్రతి కేంద్రంలో ముందస్తుగానే గన్నీ సంచులు ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పిస్తాం. మహిళలకు తాత్కాలిక మరుగుదొడ్లును ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి. కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు 24 గంటల్లోపు వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆన్లైన్ చేసిన వెంటనే వారి ఖాతాల్లోకి డబ్బులు వెళ్తాయి. కేంద్రాల నుంచి వెంటనే మిల్లులకు ధాన్యాన్ని తరలించేలా ఏర్పాట్లు చేశాం. మధ్య దళారులను నమ్మి మోసపోవద్దు.
– ఎస్.మధుసూదన్‌రావు, అదనపు కలెక్టర్