భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పూల పండుగ కానుకగా బతుకమ్మ చీరెలను అందిస్తున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బతుకమ్మ చీరెల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కుటుంబాల ఆధారంగా చీరెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే పండుగలకు పెద్దపీట వేసిందన్నారు. అన్నివర్గాల వారికి తారతమ్యం లేకుండా కానుకలు ఇవ్వడం సంప్రదాయమన్నారు. అందుకే ప్రతి దసరాకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా చీరెల పంపిణీ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్, ఎస్పీ వినీత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో రాజు పాల్గొన్నారు.
త్వరలో భద్రాద్రి జిల్లాకు సీఎం కేసీఆర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో రానున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. కొత్తగూడెంలో నిర్మాణం పూర్తి అయిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ దసరా తర్వాత జిల్లాలో మూడు కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారని, మెడికల్ కాలేజీ, కలెక్టరేట్‌తోపాటు టీఆర్ఎస్ భవన్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మచ్చా నాగేశ్వరరావు, నాయకుడు బిక్కసాని నాగేశ్వరరావు, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, అన్వర్‌పాషా, సందీప్‌రెడ్డి, హరికృష్ణ, మురళి, శ్రీకాంత్, ఎండీ ఆదం, సాయిని, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ జిల్లా నూతన కార్యాలయాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ రేగా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు