గిరిజనుల పోడుహక్కు పట్టాల విషయంలో సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. పోడు భూములకు పట్టాల ప్రక్రియపై ప్రభుత్వం జీవో నంబర్ 140ని జారీ చేసింది. దీనిపై భద్రాద్రి కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులతో మంత్రి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు పట్టాలు జారీ చేస్తూనే అడవిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పోడు సమస్య పరిష్కారానికి గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : గిరిజనుల పోడుహక్కు పట్టాల విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం సాహసోపేతమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. పోడుపట్టాల జారీ ప్రక్రియపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 140పై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో హైదరాబాద్ నుంచి మంత్రి వీడియా కాన్ఫరెన్స్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోడు పట్టాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ పోడుపట్టాలు ఇస్తానని ప్రకటన చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. అర్హులకు పట్టాలు జారీ చేస్తూనే అడవిని కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. పోడు సమస్య పరిష్కారానికి ఆవాసాలుగా తీసుకున్న దరఖాస్తులపై సమగ్ర విచారణ జరిపి, ఎఫ్ఆర్సీ కమిటీలను నియమించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పట్టాలు ఇచ్చిన తర్వాత ఎలాంటి ఆక్రమణలు జరగకూడదని అన్నారు.
పోడు సమస్య పరిష్కారానికి గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర జిల్లాల పరిధిలో ఉన్న పోడు సమస్యల పరిష్కారం కోసం జిల్లాస్థాయి కమిటీ ఆ జిల్లాస్థాయి కమిటీకి సిఫారసు చేయాలన్నారు. కమిటీ సభ్యుల సలహాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 10లక్షల 13వేల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని, వాటిలో 2లక్షల 29వేల ఎకరాలు ఆక్రమణకు గురైందన్నారు. గతంలో 85వేల ఎకరాల భూమికి హక్కు పత్రాలు ఇచ్చామన్నారు. గతేడాది నవంబర్‌లో హాబిటేషన్ల వారీగా ైక్లెయిమ్లు స్వీకరించినట్లు తెలిపారు.
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ గతంలో ఆర్ఓఎఫ్ఆర్ హక్కుపత్రాలు జారీ చేసిన రైతులకు అటవీ అధికారుల అభ్యంతరాల వల్ల కొత్త పట్టాలు జారీ చేయలేదని అన్నారు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకూడదని పేర్కొన్నారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న మండలాలు సర్దుబాటు ప్రక్రియలో ఇతర జిల్లాల్లో కలిసిపోయాయని వాటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
పోడుహక్కు పత్రాలు తీసుకున్న వారిలో మృతిచెందిన రైతు కుటుంబాల సభ్యులకు ముటేషన్ చేయాలని సూచించారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ కమిటీ సభ్యులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ మాట్లాడుతూ గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాలు ఐటీడీఏ పరిధిలో ఉన్నాయని అక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న భూములను కూడా పరిశీలించి వారికి పట్టాలివ్వాలన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ 332 గ్రామ పంచాయతీల పరిధిలో 726 హాబిటేషన్లలో పోడు సమస్య పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
అశ్వారావుపేటలో 17,727, భద్రాచలంలో 10,732, కొత్తగూడెంలో 9,268, పినపాకలో 17,727, వైరాలో 2,497, ఇల్లెందులో 14,222 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటికే హాబిటేషన్లు వారీగా షెడ్యూల్ తయారు చేసి జిల్లాస్థాయి టీంలను సిద్ధంగా ఉంచామన్నారు. ఈ సమీక్షలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, ఎస్పీ వినీత్ జీ, జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఆర్డీవో మధుసూదనరాజు, డీపీవో రమాకాంత్, డీఆర్ఓ అశోక్‌చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో పోడు సమీక్షకు హాజరైన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా, మెచ్చా, హరిప్రియ, కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్, డీఎఫ్‌వో రంజిత్, అధికారులు