ఖమ్మం సిటీ, ఆగస్టు 28 : తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆదేశానుసారం సోమవారం ఖమ్మం పటేల్ స్టేడియంలో హాకీ లెజెండ్, మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ సమాయత్తమైంది. దానిలో భాగంగానే ఆదివారం బాస్కెట్‌బాల్ అండర్-19, జిమ్నాస్టిక్స్ అండర్-14, ఆర్చరీ అండర్-14, ఆర్చరీ అండర్-17(బాలురు), హ్యాండ్ బాల్ అండర్-16, లాన్ టెన్నిస్ అండర్-14, అండర్-16(బాలురు), స్విమ్మింగ్‌లో 100 మీటర్ల ఫ్రీ ైస్టెల్, 100 మీటర్ల బటర్‌ఫ్లై, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగాల్లో అండర్-17(బాలురు), అండర్-14(బాలురు), స్కేటింగ్ అండర్-7, అండర్-9, అండర్-11 విభాగాల్లో(బాలురు, బాలికలు), ఫుట్‌బాల్‌లో అండర్-16(బాలురు, బాలికలు) స్థాయిల వారికి పోటీలు నిర్వహించారు.
ఖమ్మం నగరంతోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కేటింగ్, స్విమ్మింగ్ విభాగాల్లో చిన్నారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం.పరంధామరెడ్డి హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ స్టేడియంలో జరిగిన క్రీడా పోటీల్లో విజేతలకు సోమవారం సాయంత్రం 5 గంటలకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని, ముఖ్యఅతిథిగా కలెక్టర్ వీపీ గౌతమ్ హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్‌లు ఎండీ గౌస్, ఎండీ అక్బర్అలీ, శివ పాల్గొన్నారు.