ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద వరద ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నది. గోదారమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో తీరప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. భద్రాద్రి వద్ద వరద ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జూలై మొదటి వారంలోనే ఈ స్థాయిలో వరదపోటు రావడం గోదారి చరిత్రలో ఇది రెండోసారి. గురువారం భద్రాచలం వద్ద వరద ప్రవాహం 64 అడుగులకు చేరుకున్నది. అర్ధరాత్రి వరకు 70 అడుగులు దాటవచ్చని అధికారుల అంచనా వేశారు. వరద పోటు కారణంగా భద్రాచలం వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వాహనాలు, అటు నుంచి రాష్ర్టానికి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భద్రాచలంలోనే మకాం వేసి వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్‌తో కలిసి భద్రాచలంలోని కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వరద పరిస్థితులపై మంత్రి అజయ్‌కుమార్‌తో ఫోన్లో మట్లాడారు. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని, ముంపు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం సూచించారు. కాగా నేటికీ ఏజెన్సీలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి.
ఖమ్మం, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. జనజీవనా న్ని అతలాకుతలం చేస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గురువారం ప్రవాహం 64 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి దాదాపు 22లక్షల క్యూసెక్కుల వరద నదిలో కలుస్తున్నది. అర్ధరాత్రి వరకు 70 అడుగులు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. వరద పోటు కారణంగా 1986లో భద్రాచలం బ్రిడ్జిపై వాహన రాకపోకలు నిలిపివేశారు. ఆ సమయంలో గోదావరి 73 అడుగుల వద్ద ప్రవహించి క్రమం గా తగ్గుతూ వచ్చింది. తాజాగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల పాటు వాహన, పాదచారుల రాకపోకలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలంలో రాకపోకలు నిలిపివేసిన కారణంగా రాష్ట్రం నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వాహనాలు, అటు నుంచి రాష్ర్టానికి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
సహాయక చర్యల్లో బలగాలు..

వరదల నేపథ్యంలో భద్రాచలంతో పాటు ఇతర ముంపు ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. ముంపువాసులకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. వరద పోటెత్తడంతో దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయం ఆవరణలో కల్యాణ మండపం పూర్తిగా నీటమునిగింది. విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వరద చేరింది. విద్యుత్ స్తంభాలు నీట మునగడంతో పర్ణశాలతో పాటు పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. దుమ్ముగూడెం మండలంలోని గంగోలు వద్ద డబుల్ బెడ్రూం సముదాయంలోని వరద చేరింది. భద్రాచలం పట్టణంలోని రామాలయ పరిసర ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. అప్రమత్తమైన అధికారులు పెద్ద పెద్ద మోటార్ల ద్వారా వరదను గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కలెక్టర్ అనుదీప్ పట్టణంలో హెలికాఫ్టర్‌ను సిద్ధంగా ఉంచారు. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారి బాగోగులను సెక్టోరియల్, రెవెన్యూ అధికారులు చూస్తున్నారు. వారికి కావాల్సిన ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.
మంత్రి అజయ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్..

గోదావరి వరదల నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భద్రాచలంలోనే బస చేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. గురువారం కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్‌తో కలిసి భద్రాచలంలోని కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వరద పరిస్థితులపై మంత్రి అజయ్‌కుమార్‌తో ఫోన్లో మట్లాడారు. మంత్రి వారికి వరద పరిస్థితులను వివరించారు. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని, ముంపు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం సూచించారు.
జల దిగ్బంధంలో ఏజెన్సీ..

వరుసగా కురుస్తున్న వర్షాలకు ఐదోరోజూ ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్, వెంకటాపురం, చింతూరు వెళ్లే ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. బూర్గంపహాడ్ మండలంలోని సారపాక, నాగినేనిప్రోలురెడ్డిపాలెం, ఇరవెండి, అశ్వాపురం మండలంలోని పలు గ్రామాలకు చెందిన లోతట్టు ప్రాంతవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. సారపాక, బూర్గంపహాడ్ పునరావాస కేంద్రాలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరిశీలించారు. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారితో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. అనంతరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో ముచ్చటించారు. ఏమరుపాటుగా ఉండొద్దని, అధికారుల సూచనలను పాటించాలన్నారు.