భధ్రాద్రి కొత్తగూడెం, జూలై 14 (నమస్తే తెలంగాణ): భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటవచ్చని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన గురువారం భధ్రాచలం సబ్ కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించేందుకు చేసిన, చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. “రానున్న 48 గంటలు చాలా కీలకం. అప్రమత్తంగా ఉండాలి” అన్నారు. గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్నందున ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా గురువారం సాయంత్రం 5.00 నుంచి శనివారం సాయంత్రం 5.00 గంటల వరకు (48 గంటలపాటు) భద్రాచలం వంతెనపై రాకపోకలను నిలిపివేసినట్లు చెప్పారు.
భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లోని ప్రజలు ఇంటి వద్దనే ఉండేలా 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేంత వరకు ప్రజలు జిల్లా అధికార యంత్రాంగం ఇచ్చే సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాలని కోరారు. అత్యవసర వైద్య సేవలకు కంట్రోల్ రూమ్ నంబర్లకు కాల్ చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో సురక్షిత తాగునీరు, నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలు, వాటిలో సదుపాయాలపై మండలాలవారీగా తహసీల్దార్ల నుంచి వివరాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక్ చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, అన్నిశాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.