కొత్తగూడేనికి చెందిన పదమూడేళ్ల అమ్మాయి మార్వాడి షాపులో పనిచేస్తున్నది. బడిలో ఉండాల్సిన ఆమె బాల్యం తల్లిదండ్రుల పేదరికం వల్ల పనిలో మగ్గుతున్నది. ఇది గత సంవత్సరం కనిపించిన సీన్.. కట్ చేస్తే, ఇప్పుడు ఆ పాప పాల్వంచ కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది. ఇది ‘ఆపరేషన్ ముస్కాన్’తో సాధ్యమైంది. ఇలా ఎందరో బాలల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కార్యక్రమాలు ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్. ఇప్పటివరకు ఏడేళ్లలో 1,150మంది బాలకార్మికులను గుర్తించిన అధికారులు వారికి విముక్తి కల్పించారు. ప్రస్తుతం ఎనిమిదోసారి ‘ఆపరేషన్ ముస్కాన్’కు సిద్ధమయ్యారు.
– భద్రాద్రి కొత్తగూడెం, జూలై 14 (నమస్తే తెలంగాణ)
పేదరికంతో ఎంతోమంది బాలలు పనిలో మగ్గుతున్నారు. చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ వారి జీవితాలు అక్కడే ఆగిపోతున్నాయి. చివరికి చదువులు లేక తెలిసీ తెలియని వయస్సులోనే పెళ్లిళ్ల్లు చేసుకుని ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. సరైన పోషణ లేక పుట్టే పిల్లలు అనారోగ్యానికి గురై వారి జీవితాలూ మసకబారిపోతున్నాయి. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు బాలల సంరక్షణ కమిటీ, ఐసీడీఎస్, ఐసీపీఎస్, పోలీస్‌శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరుతో ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తున్నది. బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపి బాల్యాన్ని బడిలో చేర్పించడానికి పనిచేస్తున్నది. జనవరి నెలంతా ఆపరేషన్ స్మైల్, జూలై నెలంతా ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందుకోసం జిల్లావ్యాప్తంగా అన్ని స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ప్రతి ఏటా రెండుసార్లు షాపులు, సినిమాహాల్స్, రెస్టారెంట్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలపై దాడులు చేసి బాల్యానికి భరోసా కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీ ప్రారంభమైన ఈ ఆపరేషన్ ముస్కాన్ నెలరోజులపాటు పకడ్బందీగా జరగనున్నది. ముస్కాన్ ఎనిమిదో విడతకు పోలీస్, మహిళా, శిశు సంక్షేమశాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.
బాలల హక్కులను కాపాడుదాం..
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మహిళలను కించపరిచే వారిని పట్టుకొని కమిటీ ఎదుట హాజరుపరుస్తున్నాం. పిల్లలను షాపుల్లో పనికి పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం అందరం టీంగా పనిచేసి సంవత్సరంలో రెండు సార్లు నెలపాటు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నం.
– వెంకటేశ్వరరావు, సీఐ, ఏహెచ్‌టీయూ, కొత్తగూడెం
బాల్యం బడిలోనే ఉండాలి
చదువుకోవాల్సిన వయస్సులో బడిలో ఉంటే విజ్ఞానం వస్తుంది. పనిలో ఉంటే విలువైన జ్ఞానం ఆవిరైపోతుంది. పేదరికంలో ఉన్న పిల్లలను చదివించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటున్నది. హాస్టల్ సౌకర్యంతోపాటు చదువుకునే అవకాశం కల్పిస్తున్నది. పెద్ద చదువులు చదివితే తల్లిదండ్రుల పేదరికం పోతుంది. దయచేసి పిల్లలను బడికి పంపండి. షాపు యజమానులు పిల్లలను పనిలో చేర్చుకోవద్దు.
– దురిశెట్టి అనుదీప్, కలెక్టర్
బాల్యానికిభరోసాబాలబాలికలకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నది. ప్రతి ఏడాది జూలై 1 నుంచి 31వ తేదీ వరకు గత ఎనిమిదేండ్లుగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నది. కార్మికులుగా పనిచేస్తున్న బడీడు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ హాస్టళ్లు, కస్తూర్బా పాఠశాలల్లో చేరుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు తమ పిల్లలను చదివించుకోలేక కూలీలుగా మారుస్తున్నారు. పిల్లలతో తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవచ్చని దుకాణాలు, ఇండ్ల యజమానులు వారిని కూలికి పెట్టుకుంటున్నారు. ఇది బాల కార్మిక హక్కులు, చట్టాలకు విరుద్ధం. దీనిపై ప్రభుత్వం ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. దీంతో బడీడు పిల్లలు బాలకార్మికులుగా మగ్గుతూ చదువుకు దూరమవుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా చదువులు, వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఏడు విడతలుగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఏడేళ్లలో జిల్లాలో 1,150మంది బాలకార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించింది. ఎనిమిదో విడత నిర్వహించేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అధికారులు సిద్ధమయ్యారు. మహిళా, శిశు, సంక్షేమం, కార్మికశాఖ, ఎస్సీ ఎస్టీ, బీసీ, మ
మారుతున్న సమాజం
ఏటా రెండుసార్లు ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ పేరుతో సమావేశాలు నిర్వహించడం వల్ల సమాజంలో కొద్దిమార్పు కనబడుతున్నది. ఆకస్మికంగా దాడులు చేయడం, పిల్లలను బడిలో చేర్పించడం వల్ల తల్లిదండ్రులు కూడా పనుల్లో పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా కలెక్టరేట్లో బాలల పరిరక్షణ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు తెలిపారు. గతంలో ఆపరేషన్ ముస్కాన్ అమలైన తీరు, ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఎక్కడైనా వీధి బాలలు, బాల కార్మికులు కనిపిస్తే పోలీసులకు లేదా చైల్డ్‌లైన్ 1098 నంబర్‌కు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు. దీనికి సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తే వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను పోలీసుశాఖ కోరుతున్నది. బడీడు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టప్రకారం శిక్షించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ పిల్లలుంటే అట్రాసిటీ కేసు నమోదు చేయనున్నారు. బడీడు పిల్లల కోసం ఆపరేషన్ ముస్కాన్-8తో అన్ని శాఖలు రంగంలోకి దిగాయి.