బూర్గంపహాడ్/ సారపాక, జూలై 14: బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతాలను వరద నీరు చుట్టిముట్టింది. మోతే పట్టీనగర్, సారపాకలోని పలు కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో పరీవాహక ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. సారపాక – నాగినేనిప్రోలు రెడ్డిపాలెం బూర్గంపహాడ్, మోతె, ఇరవెండి – అశ్వాపురం మధ్య రహదారులపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకాలు నిలిచిపోయాయి. మరోవైపు మండలంలో 144 సెక్షన్ విధించిన కలెక్టర్.. గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత గోదావరి వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వరదనీటి ప్రభావంతో కోయగూడెం వద్ద వరిపొలాలు నీటమునిగాయి. మోతే పట్టీనగర్లోని వరద బాధితులను సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్ తాళ్లగొమ్మూరు పునరావాస కేంద్రానికి తరలించారు. సారపాకలోని ముంపు ప్రాంతవాసులను బీపీఎల్ స్కూల్లోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఆయా కేంద్రాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ముంపు బాధితులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు.
తాళ్లగొమ్మూరు ఫంక్షన్హాల్లోని పునరావాస కేంద్రంలో మోరంపల్లి బంజర పీహెచ్సీ డాక్టర్లు వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశారు. సారపాక ప్రధాన సెంటర్ నుంచి వరద పరిస్థితిని తహసీల్దార్ భగవాన్‌రెడ్డి, ఎస్సై జీవన్‌రాజు సమీక్షిస్తున్నారు. మైకు ద్వారా జాగ్రత్తలు వివరించారు. బూర్గంపహాడ్ శివారున సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద ఓ వ్యక్తి వరదలో చిక్కుకున్నాడు. సమచారం అందుకున్న తహసీల్దార్ భగవాన్‌రెడ్డి.. అక్కడ విధుల్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరమేశ్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే అతడు స్థానిక యువతతో కలిసి వెళ్లి ఆ వ్యక్తిని కాపాడారు. బుధవారం అర్ధరాత్రి ముంపు ప్రాంతంలో వరద పెరగడంతో ఓ గర్భిణి భయాందోళనకు గురైంది. స్థానికులు తహసీల్దార్ భగవాన్రెడ్డికి సమాచారం అందించగా వెంటనే ఆయన అక్కడకు చేరుకుని ఆమెను సురక్షితంగా మోరంపల్లిబంజర పీహెచ్‌సీకి తరలించారు. బూర్గంపహాడ్ మండలానికి నలువైపులా రహదారి మార్గాలు వరదతాకిడితో స్తంభించాయి. మోరంపల్లిబంజర, బూర్గంపహాడ్ల్లో పొలాలు నీటిముంపునకు గురయ్యాయి.
అధైర్యపడొద్దు..: మంత్రి, ప్రభుత్వ విప్
ముంపు బాధితులందరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వరద బాధితులకు అభయమిచ్చారు. సారపాకలోని బీపీఎల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి పరిశీలించారు. పునరావాస కేంద్రంలో మీకు ఏమైనా సమస్యలున్నాయా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. వరదల గురించి ఎలాంటి భయాలూ వద్దని, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. అనంతరం మండల కేంద్రమైన బూర్గంపహాడ్‌లోని కస్తూర్భా గాంధీ బాలికల కళాశాల, వ్యవసాయ మార్కెట్‌యార్డు, రెడ్డిపాలెంలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కూడా మంత్రి పరిశీలించారు. బాధితులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో ముంపు ప్రాంతం నుంచి వచ్చిన ఓ గర్భిణిని పలకరిస్తూ.. ‘అమ్మా.. నీకు అన్ని సౌకర్యాలూ అందుతున్నాయా? అని అడిగారు. ‘వైద్య చికిత్స అవసరమైతే ఇక్కడి వైద్యులకు చెప్పు? అని సూచించారు.