ఖమ్మం సిటీ, జులై 14: మాతా శిశు ఆరోగ్యం సామాజిక బాధ్యత అని యునిసెఫ్ ప్రతినిధులు అన్నారు. నగరంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం వారు డీఎంహెచ్‌వో మాలతితో సమావేశమయ్యారు. జిల్లాలో మాతాశిశు సంరక్షణపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. యునిసెఫ్ దేశవ్యాప్తంగా నాలుగు రాష్ర్టాల్లో ఈ సేవలపై అధ్యయనం చేస్తున్నదన్నారు. నివేదికను భారత ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాలతి మాట్లాడుతూ.. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నారన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశామని, గర్భిణులకు ఆరోగ్య సమాచారం అందిస్తున్నామన్నారు. వైద్యశాలల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అనంతరం జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్, వైద్యసేవల గురించి వివరించారు. సమావేశంలో యునిసెఫ్ సభ్యులు శ్రీలత, లలిత, జ్యోత్స్న, ఏపీవో రాము, డిఫ్యూటీ డీఎంహెచ్‌వో రాంబాబు, ఎంసీహెచ్ ప్రొగ్రాం అధికారి సైదులు, డీఐవో ప్రమీల, డీటీటీ పీవో మోత్యా పాల్గొన్నారు.
బోనకల్ మండలంలో పర్యటన..
బోనకల్లు, జూలై 14:మాతా శిశు సంరక్షణపై అధ్యయనం చేసేందుకు నాలుగు రోజులుగా యునిసెఫ్ బృందం జిల్లాలో పర్యటిస్తున్నది. దీనిలో భాగంగా గురువారం బృందం బోనకల్లు పీహెచ్‌సీని సందర్శించింది. బృందం సభ్యులు ఆస్పత్రి వైద్యాధికారులు శివకిశోర్, విక్రమ్ గర్భిణులు, బాలింతలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం మండలంలోని బోనకల్లు, బ్రాహ్మణపల్లి, చొప్పకట్లపాలెం, రావినూతలతో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. 60 మంది గర్భిణులు, 20 మంది బాలింతలతో మాట్లాడారు. బోనకల్లు పీహెచ్సీ నుంచి అందుతున్న సేవలపై ఆరా తీశారు. జిల్లాలోని బోనకల్లు, చింతకాని, ఏన్కూరు పీహెచ్‌సీలతో పాటు సత్తుపల్లి ఏరియా ఆసుపత్రి, ఖమ్మం ప్రధాన ఆసుపత్రుల్లో సర్వే నిర్వహిస్తున్నామని బృందం సభ్యులు తెలిపారు. వారి వెంట వైద్యులు శ్రీకాంత్, బాలకృష్ణ, ప్రశాంత్, సీహెచ్‌వో శ్రీనివాసరావు, స్టాఫ్‌నర్స్ భవాని, సూపర్వైజర్లు స్వర్ణమార్త, రాజ్యలక్ష్మి తదితరులున్నారు.