మామిళ్లగూడెం/ సత్తుపల్లి టౌన్, జూలై 7: తన నియోజకవర్గంలో పలు సమస్యలకు పరిష్కార మార్గం చూపాలంటూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌ను గురువారం ఖమ్మం కలెక్టరేట్లో కలిశారు. పెనుబల్లి మండలం కేడబ్ల్యూ చౌడవరంలో పోడు భూముల వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించి రైతులకు పట్టాలు ఇప్పించాలని కోరారు. సింగరేణి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన రైతుల్లో రేజర్ల గ్రామానికి చెందిన 24 మంది రైతులకు నష్టపరిహారం అందలేదన్నారు. వారికి సత్వరమే ఆ పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సహకారాన్ని ఐటీడీఏ నుంచి తీసుకుని పనులు ప్రారంభించాలని కోరారు. సాంకేతిక కారణాల వల్ల ఏర్పడిన మిస్సింగ్ సర్వే నెంబర్లను జతపర్చడానికి ధరణి పోర్టల్‌లో ఆప్షన్‌ను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.