మామిళ్లగూడెం, జూలై 7 : ఖమ్మం నగరంలో భారీ చోరీ జరిగిన సంఘటన బుధవారం రాత్రి చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం నగరంలోని బురదరాఘవాపురం ప్రాంతానికి వెళ్లే రోడ్డులో బూర్ల లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. వీరితో పాటు కూతురు, అల్లుడు ఉంటున్నారు. భర్త లక్ష్మీనారాయణ గాంధీచౌక్‌లో ప్రాంతంలో సాయిశివ భగవత్ బంగారు నగల దుకాణానికి వెళ్లగా కూతురు, అల్లుడు వారి సొంత గ్రామానికి వెళ్లారు.
రాత్రి 7.50 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న విజయలక్ష్మిని కొందరు వ్యక్తులు చుట్టు ముట్టి కత్తులతో బెదిరిస్తూ ఆమె మెడలోని బంగారంతో పాటు ఇంట్లోని రూ.1.48 లక్షల నగదు, 65 తులాల బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు తీసుకొని ఆమెను బెడ్రూంలో ఉంచి బయట గడియ పెట్టి వెళ్లిపోయారు. దుఖాణం మూసి ఇంటికి వచ్చిన లక్ష్మీనారాయణ భార్యను ఎంత పిలిచినా పలకలేదు. బెడ్రూమ్ వైపు చూడగా కిటికీలోంచి భర్తను పిలిచింది. గడియ తీయగా జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. ఈ విషయాన్ని మూడో పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు.
విషయం తెలుసుకున్న నగర ఏసీపీ ఆంజనేయులు, సీసీఎస్ ఏసీపీ రవికుమార్, త్రీ టౌన్ సీఐ సర్వయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమోరాలను పరిశీలించగా ఒక ఆటో సంఘటన జరగడానికి ముందు సాయంత్రం 6.18 గంటల నుంచి రాత్రి 8.20 గంటల వరకు ఇంటి ఎదుటే నిలిపి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆటోలోంచి కొందరు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి రావడం కనిపించింది. అయితే దూరంగా ఉండడంతో వారి చిత్రాలు స్పష్టంగా కనిపించడం లేదు. ఈ సంఘటనపై బాధితుడు బూర్లె లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సర్వయ్య తెలిపారు.