ఖమ్మం, జూలై 7: పేదల ఆత్మగౌరవం చాటేలా మంత్రి అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగిస్తే దానిని చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు ఆరోపించారు. మంత్రి పువ్వాడపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా చేస్తున్న బురద జల్లుడు ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఖమ్మంలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, కమర్తపు మురళి మాట్లాడారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రెండు రోజుల క్రితం ఖమ్మం టేకులపల్లిలోని కేసీఆర్ టవర్స్ దగ్గరకు వెళ్లిన బీజేపీ నాయకులపై లబ్ధిదారులు తిరిగబడినా వారికి బుద్ధిరావడం లేదని విమర్శించారు. పూర్తి పారదర్శకతతోనే డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. అయినా కాషాయ పార్టీ నేతల బుద్ధి మారకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.