ఖమ్మం సిటీ, జూలై 7: ఖమ్మంలోని వింగ్స్ జోయా సంతాన సాఫల్య కేంద్రంలో ఐవీఎఫ్ పద్ధతిలో తొలిసారిగా ఇద్దరు కవలలు జన్మించారని డాక్టర్ నైమా సుల్తానా వెల్లడించారు. తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారని చెప్పారు. గురువారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మధిర మండలం మర్లపాడు గ్రామానికి చెందిన సాధారణ రైతు వెంకటకృష్ణ దంపతులకు 14 ఏళ్లుగా సంతానం కలగడం లేదని, చివరి ప్రయత్నంగా తమ వద్దకు వచ్చారని అన్నారు.
వారికి చికిత్స ప్రారంభించగానే తొలి కాన్పులో ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారని అన్నారు. ఖమ్మం వింగ్స్ జోయా ఆసుపత్రిలో దక్షిణాదిలోనే మొదటి ఐవీఎఫ్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేవలం పది నెలల్లోనే 70 శాతం సక్సెస్ రేటును సాధించామన్నారు. మొత్తం 14 ఐవీఎఫ్ కేసులు నమోదవగా 10 పాజిటివ్‌గా తేలాయన్నారు. మిగతా నాలుగు కేసులకు సంబంధించి పాజిటివిటీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఒకానొక దశలో మెట్రో నగరాలకే ఐవీఎఫ్ పరిమితమై ఉండేదని, తమ వింగ్స్ జోయా ఆసుపత్రిలో ప్రత్యేక బ్రాంచిని నెలకొల్పి గ్రామీణ ప్రాంతాల్లోని మధ్య తరగతి, సామాన్య వర్గాలకు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.