కల్లూరు రూరల్, జూలై 7: బంధువుల ఇంట శుభకార్యానికి ఆ అక్కాతమ్ముడు కలిసి ద్విచక్ర వాహనంపై వచ్చారు. వేడుక అనంతరం తిరిగి వెళ్తుండగా వర్షం రావడంతో రోడ్డు పక్కన నిల్చున్నారు. వారి పైకి ఐషర్ వ్యాన్ మృత్యువులా దూసుకొచ్చింది. అక్క అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. కల్లూరు మండలం హనుమతండా పోలీస్ చెక్‌పోస్టు వద్ద గురువారం ఈ ఘోరం జరిగింది. కొత్తగూడెం పట్టణం శివారులోని పెనుబల్లి గ్రామానికి చెందిన అక్కాతమ్ముడు కంపసాటి సావిత్రి, చెవుల నర్సింహారావు.. తల్లాడ మండలం రంగంబంజరు గ్రామంలో జోనబోయిన కృష్ణయ్య బిడ్డ ఓణీల అలంకరణ వేడుకకు గురువారం ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. మధ్యాహ్నం భోజనం చేస్తుండగా సావిత్రి కూతురు ఫోన్ చేసి త్వరగా రావాలని కోరింది.
సావిత్రి కుటుంబం పెనుబల్లి మండలం టేకులపల్లిలో ఉంటున్నది. ఆ అక్కాతమ్ముడు కలిసి టేకులపల్లికి బయల్దేరారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో హనుమాతండా చెక్‌పోస్ట్ వద్దకు చేరుకునేసరికి వర్షం మొదలైంది. రోడ్డు పక్కన బైక్ ఆపి చెట్టు కింద ఇద్దరూ నిల్చున్నారు. ఇంతలోనే ఖమ్మం వైపు అతి వేగంగా వెళ్తున్న ఐషర్ వ్యాన్ అదుపు తప్పి, రోడ్డు పక్కన నిలుచున్న ఆ అక్కాతమ్ముడి పైకి దూసుకెళ్లింది. సావిత్రి(55) తలపైకి టైరు ఎక్కడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తమ్ముడు నర్సింహారావు.. వ్యాన్ కింద ఇరుక్కుపోయాడు. కల్లూ రు ఎస్సై వెంకటేశ్, తల్లాడ ఎస్సై సురేశ్ జేసీబీ తెప్పించి, వ్యాన్‌ను పక్కకు లాగించి, దాని కింద ఇరుక్కున్న నర్సింహారావును బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఎస్సై వెంకటేశ్ కేసు నమోదుచేసి, సావిత్రి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు నర్సింహారావును మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు.
చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కల్లూరు, తల్లాడ పోలీసులు.. వర్షం పడుతుండడంతో ఎదురుగా ఉన్న కిరాణా కొట్టులో కూర్చున్నారు. వారు కూర్చున్న వైపే వ్యాన్ దూసుకొచ్చింది. ఆ అక్కాతమ్ముడిని ఢీకొని, పోలీసులు కూర్చున్న కిరాణా కొట్టుకు కేవలం ఒక్క అడుగు దూరంలో బురదలో చిక్కుకుని ఆగింది. ఆ బురదే లేనట్లయితే.. వ్యాన్ అదే వేగంతో ముందుకు వెళ్లేదంటూ ఆ పోలీసులు, స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు.