
మణుగూరు రూరల్, సెప్టెంబర్ 22: అత్యాశ.. బాధ్యతాయుతమైన పని నుంచి పక్కదారి పట్టించింది. బ్యాంకులో పనిచేస్తూ ఖాతాదారులు జమ చేసిన రూ.కోట్లను శాఖ డిపాజిట్ల లెక్కల్లో చూపకుండా పక్కదారి పట్టించారు. లగ్జరీ లైఫ్‌కి అలవాటుపడి తాము పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశారు. ఆడిటింగ్ మొదలుకావడంతో పరారైన నిందితులు.. సీఈవో ఫిర్యాదుతో కటకటాలపాలయ్యారు. స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ ఆ వివరాలు వెల్లడించారు. మణుగూరు పూలమార్కెట్ వద్ద ఉన్న భద్రాద్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో మేనేజర్‌గా పందుల రాము, అసిస్టెంట్ మేనేజర్‌గా అక్బర్, క్యాషియర్‌గా చిత్తపోగు రామారావు, అటెండర్‌గా గనిబోయిన రవీందర్‌కుమార్ పని చేస్తున్నారు. ఖాతాదారులు తమ ఖాతాల్లో జమ చేస్తున్న నగదును శాఖ డిపాజిట్లలో చూపకుండా రెండేళ్లుగా వీరు తమ సొంతానికి వాడుకున్నారు. దాదాపు రూ.2.91 కోట్లను లెక్కల్లో చూపకుండా పక్కదారి పట్టించారన్నారు.
ఈ క్రమంలో కరోనా నేపథ్యంలో ఆలస్యమైన ఆడిటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. డిపాజిట్లలో రూ.2.91 కోట్లు తక్కువగా ఉన్నట్లు ఆడిటింగ్‌లో తేలింది. ఇదే సమయంలో ఆ శాఖలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది కనిపించకుండాపోయారు. వారిపై అనుమానంతో బ్యాంక్ సీఈవో సాంబమూర్తి మణుగూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆగస్టు 24న కేసు నమోదైంది. విచారణ ప్రారంభించిన పోలీసులు.. మేనేజర్ పందుల రామును అదుపులోకి తీసుకుని ఈనెల 8న కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అనంతరం మిగిలిన ముగ్గురినీ పట్టుకొని విచారించి రూ.1.44 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారినీ కోర్టులో హాజరుపర్చనున్నారు. కేసు ఛేదించిన ఏఎస్పీ శబరీష్, సీఐ భానుప్రకాశ్, ఎస్సై నరేశ్, సిబ్బంది మోహన్, మల్సూర్, పాషా, షమీమ్, కృష్ణలను ఎస్పీ అభినందించారు.