వానొస్తే ఆ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. వర్షం రాకుంటే సాగు ముందుకు సాగదు. దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ ప్రాంతవాసుల కష్టాలకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. రాకపోకలకు అంతరాయం లేకుండా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచింది. వ్యవసాయానికి నీటి వసతి కల్పించడంతో రైతులు ఆనందంగా సాగులోకి దిగుతున్నారు. పాల్వంచ పట్టణంలోని శ్రీనివాసకాలనీ వద్ద ఉన్న మొర్రేడువాగుపై వంతెన, చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.9 కోట్లు కేటాయించింది. రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేసింది. దీంతో మండు టెండలోనూ జలకళ సంతరించుకున్నది. వంతెన వద్ద నుంచి దాదాపు 2 కిలోమీటర్ల వరకు నీరు నిలిచి పోయింది. అక్కడ ఆహ్లాదకర వాతావరణం సంతరించుకున్నది. అంతేకాదు, వాగు అవతల పేట చెరువు, గుడిపాడు, కొత్తూరు, బంగారుజాల, చింతలపాడు, అన్నారం, గుర్రాలకుంట గ్రామాల ప్రజలకు రవాణా, సాగు ఇబ్బందులు తొలగాయి. భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొర్రేడు వాగుపై వంతెన లేక ఆ గ్రామాల ప్రజలు దశాబ్దాల కాలంగా అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక ఈ వాగుపై వం తెన, చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.9 కోట్లు నిధులు కేటాయించింది. రెండున్న రేళ్లలో నిర్మాణం పూర్తి చేయడంతో వాగు అవతల పేట చెరువు, గుడిపాడు, కొత్తూరు, బంగారుజాల, చింతలపాడు, అన్నారం, గుర్రాలకుంట గ్రామాల ప్రజల కష్టాలు తొలగిపో యాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-పాల్వంచ, జూన్ 14
మొర్రేడు వాగుపై వంతెన నిర్మాణంతో గిరిజనుల బాధలు పూర్తిగా తొలగిపోయాయి. వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు ఎన్నో అవస్థలు ఎదుర్కొనేవారు. వాగు ఉప్పొంగిందంటే పాల్వంచ నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. ఒకవేళ పా ల్వంచకు రాకపోకలు సాగించాలంటే ఏకైక మార్గం ములకలపల్లి మండలంలోని అన్నారం, పాతూరు మీదుగా చుట్టూ తిరిగి పోవాల్సి ఉండేది. వ్యవసాయ పరికరాలు, ఎరువులు తదితర సామగ్రి తీసుకెళ్లాలంటే ఇబ్బందులు పడేవారు. అంతేకాదు, వాగు దాటే క్రమంలో ఆకస్మాతుగా వరదొచ్చి కొట్టుకుపోయి అనేక మంది మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ఆయా గ్రామాల ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించేవారు. వంతెన నిర్మాణంతో ఎన్నోఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రజల కష్టాలు తొలగిపోయాయి. రాకపోకలకు మార్గం సుగుమమైంది.
పాల్వంచ పట్టణంలోని శ్రీనివాసకాలనీ వద్ద ఉన్న మొర్రేడువాగుపై వంతెన, చెక్‌డ్యాం నిర్మించడంతో మండుటెండలోనూ జలకళ సంతరించుకున్నది. వంతెన వద్ద నుంచి దాదాపు 2 కిలోమీటర్ల వరకు నీరు నిలిచింది. అక్కడ ఆహ్లాదకర వాతావరణం సంతరించుకున్నది. వంతెన పూర్తి చేసిన తర్వాత అంచెలంచెలుగా గుడిపాడు వరకు వంతెన నుంచి సిమెంటు రోడ్డు నిర్మించారు. దీంతో ప్రజలకు పూర్తిస్థాయి రవాణా సౌకర్యం ఏర్పడింది. పాల్వంచ, ములకలపల్లి మండల వాసులకు ప్రయోజనం చేకూరింది.
సాగుకు మార్గం
వంతెన నుంచి 2 కిలోమీటర్ల మేర నీరు నిలిచిపోవడంతో వాగుకు ఇరువైపులా ఉన్న రైతులు కరెంటు మోటర్లు, ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ నీరు నిల్వ ఉండడంతో వాగులో చేపల పెంపకానికి అనుకూలంగా మారింది. వాగు వద్ద నీరు నిల్వ ఉండడంతో పాల్వంచ పట్టణంలో భూగర్భజలాలు పెరిగాయి. వాగుకు 2కిలోమీటర్లకుపైగా ఉన్న ప్రాంతాలన్నింటిలో ఎక్కడ బోర్లు వేసినా 40 అడుగులు దాటితే చాలు నీరు ఉబికి వస్తున్నది.
పెరిగిన భూముల ధరలు
వంతెన నిర్మాణంతో వాగు అవతల ఉన్న వ్యవసాయ భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎకరం నాలుగైదు లక్షలు పలకని ధరలు ప్రస్తు తం రూ.20 లక్షలపైగా పలుకుతున్నాయి. పట్టణానికి సమీపంలో ఉండడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొత్తగూడెం ఎయిపోర్టు నిర్మాణం కో సం పేటచెరువు, కొత్తూరు, బంగారుజాల ప్రాంతంలో సర్వే చేపట్టడంతో భూములకు డిమాండ్ పెరిగింది.

వంతెన వద్ద ఆహ్లాదకర వాతావరణం
వంతెన కమ్ చెక్‌డ్యాం నిర్మాణంతో నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. నిండా నీటితో వాగుకు జలకళ సంతరించుకున్నది. వంతెన వద్దకు రాగానే ఆహ్లాదకర వాతావరణం స్వాగతం పలుకుతున్నది. ఈ మార్గంలో పయనించేవారు అక్కడ కాసేపు సేదతీరి వెళ్తున్నారు. వంతెన నిర్మాణంతో సరికొత్త శోభను సంతరించుకోవడంతో పర్యాటకులు వచ్చి సేద తీరుతున్నారు. వంతెన వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కును అభివృద్ధి చేస్తే బాగుంటుందని పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు.
వంతెన నిర్మాణంతో తొలగిన ఇబ్బందులు
గతంలో ఇక్కడ వంతెన లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వంతెన నిర్మాణంతో రవాణా కష్టాలు తీరా యి. ఈ ప్రాంతంలోని భూములకు ధరలు పెరిగాయి. ఎయిర్‌పోర్టు కూడా వస్తుందని అంటున్నారు. అది వస్తే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది.
-తాటికొండ నర్సింహ, పేటచెరువు
వాగులో పుష్కలంగా జలం
వంతెన కమ్ చెక్‌డ్యాం నిర్మించడంతో మండుటెండలోనూ వాగు వద్ద పుష్కలంగా జలం ఉంది. మత్స్య సంపద కూడా పెరుగుతున్నది. వాగుకు ఇరువైపులా సాగుకు అనుకూలంగా మారింది. ఇప్పుడిప్పుడే మా ప్రాంతలోని భూములకు మంచి ధరలు పలుకుతున్నాయి. భవిషత్తులో మా ప్రాంతం మరింత అభివృద్ధి జరుగుతుంది.
-కొమరం లక్ష్మి, గుడిపాడు