ముదిగొండ, జూన్ 14 : నూతన విద్యా సంవత్సరంలో వందశాతం విద్యార్థుల హాజరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. ముదిగొండ మండల పరిధిలోని మేడేపల్లి, గోకినేపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. మేడేపల్లి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదులను పరిశీలిస్తూ విద్యార్థులతో మాట్లాడుతూ వారితోపాటు కూర్చొని కాసేపు పాఠాలు విన్నారు. కలెక్టర్ కూడా పాఠం బోధించి ప్రశ్నలు అడగగా విద్యార్థులు సరదాగా చెప్పిన సమాధానాలు నవ్వులు పూయించాయి. అక్కడ ఉన్నంతసేపు కలెక్టర్లా కాకుండా విద్యార్థుల్లో ఒకడిగా మెలగడం అందరినీ ఆకర్శించింది. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు. గ్రామంలోని పల్లెప్రకృతి వనం, నర్సరీలతోపాటు వీధుల వెంట పిచ్చిచెత్తను తొలగించాలని డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రపర్చాలని వానకాలం నేపథ్యంలో వీధుల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు.
గ్రామంలోని పాఠశాలకు వెళ్లని ఇద్దరు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి స్కూల్‌కు ఎందుకు రాలేదని వారితో ముచ్చటించారు. గోకినేపల్లిలోని క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి సరదాగా వాలీబాల్ ఆడారు. క్రీడా ప్రాంగణాలు పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేవారు ఉపయోగించుకోవాలని యువతకు సూచించారు. పలువురు రైతులు కలెక్టర్‌తో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో మిల్లర్లు 5కిలోలు కట్ చేస్తున్నారని చెప్పగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో అప్పారావు, డీపీవో హరిప్రసాద్, డీఈవో యాదయ్య, ఇంజినీరింగ్ విభాగం ఈఈ నాగశేషు, డీఎల్పీ పుల్లారావు, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈవో రామాచారి, ఎంపీవో సూర్యనారాయణ, సర్పంచులు సామినేని రమేశ్, క్రాంతి పాల్గొన్నారు.