ఎనిమిదేండ్లలో అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో నంబర్‌వన్ స్థానంలో నిలిచామని పేర్కొన్నారు
ఖమ్మం, జూన్ 2 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, ఆర్థిక క్రమశిక్షణతో ఎనిమిదేండ్లలో అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజమ్కుమార్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలిచిందన్నారు. ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. పోరాటయోధులకు తెలంగాణ సమాజం ఎల్లవేళలా అండగా నిలుస్తున్నదన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దళిత సాధికారతకు దళితబంధు
దళిత సాధికారత, ఆర్థిక ప్రగతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. చింతకాని మండలంలో 3,440 మంది, మిగిలిన నియోజకవర్గాల్లో 483 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు చెప్పారు. చింతకాని మండలంలో 588 మంది లబ్ధిదారులకు రూ.20 కోట్లతో రవాణా రంగంలో, రూ.7.40 కోట్లతో 558 మందికి పాడిపరిశ్రమలో రూ.3 కోట్లతో 233 మంది లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేశామన్నారు. ఐదు నియోజకవర్గాల్లో 65 మందికి ఈ పథకంలో లబ్ధి చేకూరిందన్నారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్‌తో భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకంలో వేలాది మందికి లబ్ధి చేకూరిందన్నారు. జిల్లాలో 5,243 డబుల్ బెడ్రూంలను పూర్తి చేసి 4,790 మందికి అందించామని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమంలో నంబర్ వన్..
అభివృద్ధి, సంక్షేమంలో నంబర్‌వన్ స్థానంలో నిలిచామని మంత్రి పేర్కొన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా 3,07,620 మంది రైతులకు రూ.355.43 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబీమా కింద జిల్లాలో 612 మంది నామినీలకు రూ.3.60 కోట్లను అందించామని చెప్పారు. 2022-23 సంవత్సరానికి గాను 2,94,986 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందించామని పేర్కొన్నారు. జిల్లాలో 129 క్లస్టర్లలో రూ.29 కోట్లతో రైతువేదికలను ఏర్పాటు చేశామని చెప్పారు. సమగ్ర ఉద్యాన మిషన్ కింద 362 యూనిట్లకు రూ.58 లక్షలను అందించామన్నారు. పామాయిల్ సాగుకు 2,536 మంది రైతులు 12,130 ఎకరాల విస్తీర్ణంలో దరఖాస్తు చేసుకోగా.. 11,230 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటినట్లు చెప్పారు.
ధరణితో భూ సమస్యలు పరిష్కారం
సీఎం కేసీఆర్ ఆలోచనకు ప్రతిరూపమే ధరణి అని అన్నారు. నూతన రెవెన్యూ చట్టంతోపాటు వ్యవసాయ, భూక్రయ, విక్రయాలు పారదర్శకంగా జరిగేలా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జిల్లాలో 18,775 దరఖాస్తుల రాగా.. 17,776 దరఖాస్తులు పరిష్కరించామని చెప్పారు. వీటిలో 11,031మ్యూటేషన్లకు 10,863, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎల్ ఫారాలకు సంబంధించి 829 దరఖాస్తులు రాగా.. 788, గ్రీవెన్స్ల్యాండ్ అంశాలకు సంబంధించి 5,475 దరఖాస్తులు రాగా.. 4,978 దరఖాస్తులను పరిష్కరించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో 80శాతం దరఖాస్లులు పరిష్కరించినట్లు చెప్పారు. ఈ నెల 3 నుంచి 18 వరకు నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. అక్రమ వెంచర్లను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని, 132 లేఅవుట్లకు సంబంధించి 98.20 ఎకరాలను గ్రీన్‌బెల్టు కింద సేకరించామన్నారు. ఈ స్థలాల్లో పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, గ్రామీణ, పట్టణ క్రీడామైదానాలకు కేటాయించామన్నారు.

గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు
క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా జిల్లాలో 213 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తించామన్నారు. జిల్లాలో హరితహారంలో ఈ ఏడాది 1.13 కోట్ల మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. జిల్లాలో 754 పంచాయతీల్లో రూ.11.06 కోట్లతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో 13.31 లక్షల మొక్కలను నాటామన్నారు. ప్రతి మండలంలో ఐదు బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా 969 గ్రామాలకు నీటి సరఫరా అవుతుందన్నారు.
సీతారామాతో జిల్లా సస్యశ్యామలం
సీతారామా ఎత్తిపోతల పథకం కింద పాలేరు లింగు కాలువ ద్వారా 47,381 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీటి వసతి కల్పించినున్నట్లు చెప్పారు. భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి జిల్లాలో 308 ఎకరాల భూమి సేకరించి పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ.890 కోట్లు మంజూరు చేయించామని చెప్పారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు నాలుగులేన్ల జాతీయ రహదారి విస్తరణకు 306 ఎకరాల భూ సేకరించామన్నారు. రూ.1,039 కోట్లతో చేపట్టిన ఖమ్మం కోదాడ జాతీయ రహదారి భూ సేకరణ కొనసాగుతుందన్నారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్‌కు రూ.687 కోట్లతో భూ సేకరణ జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో 426 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్వం ఇవ్వాలని వైద్యులకు సూచించారు. జిల్లాలో రూ.6.5 కోట్లతో ఐదు 33/11 కేవీ సబ్స్టేషన్లు, మరో రూ.16 కోట్లతో లోవోల్టేజీ నివారణకు 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
నగరానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు
ఖమ్మం నగరానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చామన్నారు. రోడ్ల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్, గ్రీనరీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నగరం నడి బోడ్డున నాలుగు ఎకరాల స్థలంలో 22 కోట్లతో నూతన కార్పొరేషన్ భవనం నిర్మించామని చెప్పారు. రూ.4 కోట్లతో లకారం ట్యాంకు బండ్‌ను ఆధునీకరించామని, రూ.93.70 లక్షలతో జడ్పీసెంటర్ నుంచి ఐటీ హబ్ వరకు పుట్‌పాత్ జోన్ నిర్మించామని, రూ.8.75 కోట్లతో లకారం వద్ద తీగల వంతెనను (కేబుల్ బ్రిడ్జీ), మరో రూ.2 లక్షలతో మ్యూజికల్ ఫౌంటేన్‌ను ఏర్పాటు చేశామన్నారు. దానవాయిగూడెంలో రూ.5.48 కోట్లతో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కార్మాగారాన్ని నిర్మించామన్నారు. పారిశుధ్య నిర్వహణకు రూ.1.73 కోట్లతో 10 ట్రాక్టర్లు, 15 ఆటోలను కొనుగోలు చేశామమన్నారు. నగరంలో రూ.9 కోట్లతో 25,520 ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని, రూ.35 కోట్లతో 6.5 కిలోమీటర్ల బీటీ, 9.6 కిలోమీటర్లు సీసీ రోడ్డు నిర్మించామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్, అదనపు కలెక్టర్ మొగిలి స్నేహలత, సుడాచైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.