
అశ్వారావుపేట, సెప్టెంబర్ 8: ఆయిల్‌పాం రైతుల సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ఫెడ్‌లో అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. అవినీతి అధికారులపై సంస్థ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోగా.. పదోన్నతులు కల్పించడం విస్మయానికి గురిచేస్తున్నది. అయితే, ఈ వ్యవహారాన్ని పసిగట్టిన అప్పటి ఎండీ నిర్మల విచారణకు ఆదేశించారు. సదరు అధికారి సర్వీస్ పుస్తకంలో రిమార్కు రాసి పదోన్నతి ఇవ్వకుండా నిలిపివేశారు. ఈ విషయంలో చైర్మన్ సొమ్ము రికవరీ కోసం ఆదేశించినా ఫలితం లేకపోయింది. చివరికి ఇటీవల ఆ అవినీతి అధికారి తాజా కమిటీ తప్పుడు నివేదికతో పదోన్నతి పొందినట్లు సమాచారం.
చావు మొక్కలతోపాటు నాణ్యమైన మొక్కలను నిల్వగా చూపి ఆ అవినీతి అధికారి సుమారు 30 వేల మొక్కలను దొడ్డిదారిలో అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్క మొక్కను రూ.150 నుంచి రూ.250 వరకు అమ్ముకున్నాడు. ఈ లెక్కన అవినీతి అధికారి సుమారు రూ.45 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు పోగేసుకున్నాడు. ఏప్రిల్ 1 నాటికి నర్సరీలో సుమారు 29,977 నాణ్యమైన మొక్కలు ఉండాలి. ఈ రిపోర్ట్‌ను హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి పంపించారు. ఇంతలో ఆయిల్‌పాం సాగు విస్తరణపై దృష్టిసారించిన ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు పైలట్ ప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌లకు మొక్కలు పంపించేందుకు సిద్ధమయ్యారు. కానీ నర్సరీలో కేవలం నాణ్యమైన మొక్కలు 5 వేలలోపు ఉన్నట్లు గుర్తించారు. మిగతా 24,977 మొక్కలు మాయమైనట్లు నిర్ధారించారు. దీనిపై అప్పటి ఎండీ నిర్మల విచారణకు ఆదేశించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ బృందం రెండు రోజులపాటు నర్సరీలో క్షేత్ర విచారణ నిర్వహించి 2020 జూలై 30న 24,977 మొక్కలు మాయమైనట్లు నిర్ధారించింది. నివేదికను సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డికి, ఎండీ నిర్మలకు అందజేసింది. వీరు కూడా నర్సరీలో తనిఖీలు నిర్వహించి మొక్కలు మాయమైనట్లు గుర్తించారు. ఇదే విషయమై కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవినీతి అధికారిని నిలదీశారు. సదరు అధికారి కనీసం సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. వెంటనే చైర్మన్, ఎండీ స్పందించారు. మాయమైన మొక్కల విలువను రూ.37,46,550గా తేల్చి ఈ మొత్తాన్ని ఆ అధికారి నుంచి రికవరీ చేయాలని నిర్ణయించారు.
అక్రమంగా పదోన్నతి
అవినీతి అధికారికి ఉన్నతాధికారులు ఇటీవల పదోన్నతి కల్పించినట్లు సమాచారం. గతంలో అవినీతి ఆరోపణలు ఉండడంతో పదోన్నతి ఇచ్చేందుకు ప్రస్తుత ఎండీ నిరాకరించినట్లు తెలిసింది. పాత కమిటీ మరోసారి అశ్వారావుపేటలో క్షేత్ర పరిశీలన చేయకుండానే అవినీతి, అక్రమ ఆరోపణలు లేవని నివేదిక ఇచ్చినట్లు వానదలున్నాయి. ఆ నివేదిక ఆధారంగా పదోన్నతి కల్పించినట్లు సమాచారం.
విచారణ కొనసాగుతోంది..
అవినీతి అధికారిపై విచారణ కొనసాగుతోంది. దుర్వినియోగమైన నిధులు రికవరీకి చర్యలు తీసుకుంటున్నాం. తాత్కాలిక చర్యగా అధికారిని బదిలీ చేశాం. ఆయిల్‌ఫెడ్‌లో అవినీతికి ఆస్కారం లేదు.
-రామకృష్ణారెడ్డి, ఆయిల్ఫైడ్ చైర్మన్