
ఖమ్మం, ఆగస్టు 17: ప్రభుత్వ ఉద్యోగుల్లోని ఎస్సీలకు కూడా ఆఖరి విడతలో దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం భోజన విరామ సమయంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగవరపు బాలకృష్ణ, కేంద్ర సంఘం కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ ఉద్యోగులకూ దళితబంధును వర్తింపజేయాలనుకోవడం గొప్ప విషయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, ప్రతాప్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు కొమరిగిరి దుర్గాప్రసాద్, వల్లోజి శ్రీనివాసరావు, గుంటుపల్లి శ్రీనివాస్, సగ్గుర్తి ప్రకాశ్‌రావు, జయపాల్, బుసా చంద్రశేఖర్, లలితకుమారి, రవికుమార్, రుక్మారావు, గురుమూర్తి, ఆశన్న, శ్రీధర్‌సింగ్, వల్లపు వెంకన్న, రమణ యాదవ్, సజ్జన్పాల్, యాకుబ్ పాల్గొన్నారు.
కొత్తగూడెంలో స్వీట్ల పంపిణీ
కొత్తగూడెం ఎడ్యుకేషన్: దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో మంగళవారం రాత్రి కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో దళిత సంఘాల నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని నిరూపించుకున్నారని కొనియాడారు. సబ్బారపు నాగేందర్, సీహెచ్ గోపీచంద్, మందా హనుమంతు, సిరిమల్లె కుమారస్వామి, మందా వెంకట్, సాల్మన్‌రాజ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.