మణూగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తిలో రికార్డుల పరంపర కొనసాగిస్తున్నది. సంస్థ లక్ష్యాలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ముందుకు సాగుతున్నది. మణుగూరు మండలంలోని బీటీపీఎస్‌కు రోజూ 14వేల టన్నుల నుంచి 16 వేల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉంది. దీంతోపాటు ఇతర ప్రాంతాల సిమెంట్ కంపెనీలకు బొగ్గు సరఫరా చేయాల్సి ఉండడంతో యాజమాన్యం ఏరియాలో బంకర్లు ఏర్పాటు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మణుగూరు ఏరియాలో 121 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగినట్లు సమాచారం. బొగ్గు ఉత్పత్తిలోనే కాదు.. ప్రమాద రహిత ఓసీలుగా ఈ ఏరియా గనులకు పేరున్నది. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తూ ఏరియా అవార్డు అందుకున్నది.
మణుగూరు రూరల్, మార్చి 25: సింగరేణి మణుగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తిలో దూసుకెళ్తున్నది. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. యాజమాన్యం నుంచి అభినందనలు పొందుతున్నది. ఏరియా అధికారులు సూపర్వైజర్లు, కార్మికులను సమన్వయం చేసుకుంటూ లక్ష్యాలను ఛేదిస్తున్నారు. 2021-22లో యాజమాన్యం వార్షిక ఉత్పత్తి లక్ష్యం 112 లక్షల టన్నులు నిర్దేశించగా, నెలల వారీగా లక్ష్యాలను నిర్దేంచుకుని ఏరియా లక్ష్యాలను సాధిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి కొన్నిరోజులకు ముందే 119 లక్షల టన్నుల బొగ్గును వెలికితీస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏరియాలో ఒక కంటిన్యూస్ అండర్‌గ్రౌండ్ మైన్, రెండు ఓపెన్‌కాస్ట్‌లు ఉన్నాయి. ఏరియాలో జీ-13, జీ-9, జీ-15, జీ-7,జీ-6 గ్రేడ్లలో లభ్యమవుతున్న బొగ్గుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కార్మికులు, అధికారులు ప్రతి నెలా లక్షల టన్నుల బొగ్గును రోడ్డు, రైలు మార్గాల ద్వారా రవాణా చేస్తున్నారు. మణుగూరు మండలంలోని బీటీపీఎస్‌కు ప్రతి రోజూ 14వేల టన్నుల నుంచి 16 వేల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉంది. దీంతోపాటు ఇతర ప్రాంతాల సిమెంట్ కంపెనీలకు బొగ్గు సరఫరా చేయాల్సి ఉండడంతో యాజమాన్యం ఏరియాలో బంకర్లు ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు మణుగూరు ఏరియాలో 121 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగినట్లు సమాచారం. బొగ్గు ఉత్పత్తిలోనే కాక ప్రమాద రహిత ఓసీలుగా ఈ ఏరియా గనులకు పేరున్నది. రక్షణ కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తూ ఏరియా అవార్డు అందుకున్నది.
పీకేవోసీ 2021-22 వార్షిక సంవత్సరం లక్ష్యం 90.0 లక్షల టన్నుల బొగ్గు కాగా, ఫిబ్రవరి 27న లక్ష్యాన్ని అధిగమించింది. గని రికార్డును తిరగరాసింది. మార్చి చివరి నాటికి 97.5 లక్షల టన్నుల బొగ్గు వెలికితీస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి చరిత్రలోనే పీకేవోసీ గని ఈ నెల 22 నాటికి గని నుంచి ఒకే సంవత్సరంలో 100 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి తొలిగనిగా నిలిచి అధికారుల ప్రశంసలందుకున్నది. పీకేవోసీ 2020-21 సంవత్సరానికి సంబంధించి యంత్ర సామర్థ్యాన్ని పూర్తిస్థాయి వినియోగంలో సింగరేణి వ్యాప్తంగా గని మొదటి స్థానంలో నిలవడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. మణుగూరు ఓసీ వార్షిక లక్ష్యం 18 లక్షల టన్నులు కాగా ఫిబ్రవరి 11 నాటికే లక్ష్యాన్ని అధిగమించింది. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ ప్రతినిధులు మణుగూరులో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 21 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అనుమతులు ఇచ్చారు.
యాజమాన్యం నిర్దేశించిన బొగ్గు లక్ష్యాలను ఇప్పటికే అధిగమించాం. ఒకే మైన్ నుంచి 100 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి సింగరేణి చరిత్రలోనే లేని రికార్డును నమోదు చేశాం. అధికారులు, కార్మిక నేతలు, కార్మికుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. కార్మికులు, అధికారులు, ఉద్యోగులకు అభినందనలు.
– మణుగూరు ఏరియా జీఎం జక్కం రమేశ్
అధికారులు కార్మికుల సమష్టి కృషితోనే మణుగూరు ఏరియా లక్ష్యాలు అధిగమిస్తున్నది. కార్మికుల సంక్షేమానికి యూనియన్లు అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించే యాజమాన్యానికి కార్మికులు, కార్మిక నేతల సహాయ సహకారాలు ఉంటాయి.
– టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రావు