మణుగూరు రూరల్, మార్చి 25 : మణుగూరు 100 పడకల ప్రభుత్వాస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. గత మూడు సంవత్సరాలుగా మణుగూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న కృషి ఫలించింది. నిరుపేదలు, ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు చెందిన వారికి కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేశారు. సకాలంలో వైద్యం అందక పేదలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి విముక్తి కల్పించారు. నియోజకవర్గంలోని పినపాక, కరకగూడెం, టి.కొత్తగూడెం, బయ్యారం, బుగ్గ వంటి మారుమూల గ్రామాల ప్రజలు ఎక్కువగా భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి సాధారణ పరీక్షల కోసం వెళ్తుంటారు. పోస్టుమార్టం చేయించాలన్నా వీరి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎమ్మెల్యే రేగా దృష్టి సారించి మణుగూరులోనే అన్నిరకాల వైద్య సేవలందించేందుకు విశేష కృషి చేశారు. దీనిద్వారా భద్రాచలం ఆస్పత్రి వైద్యులపై ఒత్తిడి కూడా తగ్గింది. మణుగూరులో ఒక్కొక్క సౌకర్యాన్ని సమకూర్చుకుంటూ రావడంతో వచ్చే ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో అన్నిరకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తమ చిరకాల కల నెరవేరడంతో కరకగూడెం, పినపాక, అశ్వాపురం మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రిలో కొత్తగా గైనకాలజిస్ట్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఎండీ పిడియాట్రీషన్, అనస్తీషియా, ఆర్థోపెడిక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. విశేష అనుభవం కలిగిన వైద్యులు 24గంటలు వైద్యసేవలందించేందుకు అందుబాటులో ఉండడం శుభపరిణామం. ప్రస్తుతం ఆస్పత్రిలో ఏడుగురు వైద్యులు, 13మంది స్టాఫ్‌నర్సులు, 38మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. గర్భిణులకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ అతిత్వరలో అందుబాటులోకి రానున్నది. పోస్టుమార్టం సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర సేవలకు ఐసీయూ వెంటిలేటర్లు నాలుగు, ఆరు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ కోసం 125 కేవీ విద్యుత్ అవసరం కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రూ.43 లక్షలతో 315 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయనున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రిలో ఫర్నిచర్ ఏర్పాటుకు చేయూతనందిస్తామని హామీ ఇచ్చారు.
వచ్చే ఏప్రిల్ నుంచి అన్నిరకాల వైద్య సేవలు పూర్తిస్థాయిలో పేదలకు అందుబాటులోకి వస్తాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. మణుగూరు 100 పడకల ఆస్పత్రిలో త్వరలో డయాలసిస్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. కరోనా వంటి వ్యాధులు ప్రబలినా ప్రభుత్వ వైద్యశాలలోనే చికిత్స అందించేలా కృషి చేస్తున్నాం.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే
మణుగూరు ప్రభుత్వాస్పత్రిలో దాదాపు అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఆపరేషన్ థియేటర్ పనులు జరుగుతున్నాయి. పోస్టుమార్టం సేవలు ప్రారంభమయ్యాయి. ఏఎంసీ చెకప్‌లు ఇప్పటికే ప్రారంభం కాగా, ప్రసూతి సేవలు అందుబాటులో ఉన్నాయి. మణుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం, ఏటూరునాగారం, కమలాపురం, మంగపేట తదితర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
-పంచగిరి గిరిప్రసాద్, ఆస్పత్రి సూపరింటెండెంట్