తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ గులాబీశ్రేణులు సమరశంఖం పూరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో పంజాబ్‌కు ఒక విధానం, తెలంగాణకు మరో విధానమా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల పై సీఎం కేసీఆర్ పిలుపుమేరకు టీఆర్ఎస్ శ్రేణులు పోరాటాన్ని ఉధృతం చేశారు. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
– నమస్తే నెట్వర్క్
ఖమ్మం, మార్చి 24: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనేదాకా కేంద్ర ప్రభుత్వంపై పోరు ఆగదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో పంజాబ్‌కు ఒక విధానం, తెలంగాణకు మరో విధానం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర రైతులు పండించే యాసంగి వడ్లను మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆందోళనలు చేస్తామని, కేంద్రం మెడలు వంచుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపుమేరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇందులో భాగంగా గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సన్నాహక సమావేశాల్లో నిర్వహించారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి అజయ్ ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడారు.
పంజాబ్ రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కేంద్రమంత్రులను కలిసేందుకు సీఎం ఆదేశంతో రాష్ట్ర మంత్రులం ఢిల్లీకి వచ్చామని, రెండు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని అన్నారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంలోని బీజేపీ మెడలు వంచి వస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం.. భారతదేశంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ ధాన్యాన్ని కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వడ్లను కొనకపోతే రైతుల ఆగ్రహానికి కమలం మాడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నుంచి అన్ని మండలాల్లో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతులను కేంద్రం వంచిస్తున్న తీరు గురించి తెలిసేలా ప్రతి ఇంటిపైనా నల్ల జెండాలు కట్టి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు ఈ నిరసనలు కొనసాగాలన్నారు. రైతులు మేలుకొని బీజేపీ కుట్రలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.
సత్తుపల్లి టౌన్, మార్చి 24: తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై గ్రామస్థాయి నుంచి ఉద్యమాలకు రూపకల్పన చేయాలని, బీజేపీ ప్రభుత్వ తీరును తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు.. శ్రేణులకు పిలుపునిచ్చారు. సత్తుపల్లి ఎంఆర్ గార్డెన్స్‌లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన గురువారం జరిగిన సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి ఒక్క గింజ ధాన్యం గింజను కూడా కొనుగోలు చేయబోనని చెబుతుంటే.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం.. తెలంగాణలో ఉన్న ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని రైతులను మభ్యపెడుతున్నారని అన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందడుగు వేశారని, గ్రామస్థాయి నుంచి తెలంగాణ ప్రజల వాణి వినిపించేందుకు కార్యాచరణ రూపొందించారని అన్నారు. ఈనెల 26 నుంచి 31 వరకూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో సామాన్యులపై పెనుభారం పడుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గ్రామగ్రామానా ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. ఇందుకోసం ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రైతులు.. కేంద్ర విధానాలతో అన్యాయమయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయనని తేల్చిచెబుతున్న మోదీ ప్రభుత్వానికి రైతుల ఉద్యమం రుచిచూపించాలని పిలుపునిచ్చారు.
మణుగూరు రూరల్, మార్చి 24: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై పోరుకు సమాయత్తమవ్వాలని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. మణుగూరులోని గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో పంజాబ్‌కు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన పూర్తి ధాన్యం కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. కొనకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో వరిపోరును ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఇల్లెందు, మార్చి 24: తెలంగాణ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ డిమాండ్ చేశారు. ఇల్లెందులో గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. ధాన్యం కొనకపోతే ఇప్పుడు తెలంగాణ రైతులూ కేంద్రంపై తిరగబడతారని స్పష్టం చేశారు.