మామిళ్లగూడెం, మార్చి 23: అనుభవం, వృత్తి నైపుణ్యం, ఆలోచనతోపాటు డిమాండ్ కలిగిన యూనిట్ల స్థాపనకు దళితబంధు లబ్ధిదారులు నిర్ణయం తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. చింతకాని మండలంలో ట్రాన్స్పోర్ట్ రంగానికి ప్రాధాన్యమిచ్చిన లబ్ధిదారులకు నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 22 మోటారు కంపెనీల డీలర్ల ద్వారా గురువారం వాహనాల ప్రదర్శన ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధు కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన చింతకాని మండలంలోని దళితులందరూ ఈ పథకానికి ఎంపికయ్యారన్నారు. ఇప్పటికే నిర్దేశించిన సర్వే ప్రకారం అందరికీ బ్యాంకు ఖాతాలను ప్రారంభించామన్నారు. ఇప్పటికే అనుభవం కలిగినవారు పూర్తి విశ్వాసంతో వెంటనే యూనిట్లను గ్రౌండింగ్ చేసుకోవచ్చని, అనుభవం లేని వారు తమ సందేహాలను నివృత్తి చేసుకొని పూర్తి అవగాహన పొందాలని సూచించారు. రూ.10 లక్షలతో ఒకే యూనిట్ గ్రౌండింగ్ చేయాల్సిన అవసరం లేదని, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి కూడా ఒక యూనిట్ స్థాపించుకోవచ్చునని వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కస్తాల సత్యనారాయణ, డీటీవో కిషన్‌రావు, ఎల్డీఎం చంద్రశేఖర్‌రావు, డీఏవో విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు ఖాతాలు ప్రారంభించిన సమాచారాన్ని దళితబంధు లబ్ధిదారులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో దళితబంధు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలపై ఆయన సమీక్షించారు. బ్యాంక్ ఖాతాలకు ఆన్లైన్, మొబైల్బ్యాంక్, ఏటీఎం కార్డు వంటి బ్యాంకింగ్ సేవల సదుపాయం ఉండదనే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు.