30 ఏళ్ల క్రితం అరకొర వసతులతో ప్రారంభమైన పాఠశాల.. అంచెలంచెలుగా ఎదిగింది. సకల సదుపాయాలు సమకూర్చుకుని ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన అందిస్తున్నది. దాతల సాయంతో సౌకర్యాలు ఒనగూరాయి. ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని పర్యావరణం, పరిశుభ్రత, పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నారు. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ బోధన కొనసాగుతున్నది. శారీరక, మానసిక ఆరోగ్యం పెంచేందుకు యోగాసనాలు నేర్పిస్తున్నారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు మన బడి’ టైటిల్‌ను సైతం ఈ పాఠశాల ముందుగానే రూపొందించుకున్నది. ఈ నేపథ్యంలో దుమ్ముగూడెం మండలంలోని బండారుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యా బోధన, సౌకర్యాలు, స్వచ్ఛత తదితర అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
దుమ్ముగూడెం, ఫిబ్రవరి 23 : సుమారు 30 ఏళ్ల క్రితం అరకొర వసతులతో ప్రారంభమైన ఈ పాఠశాల.. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఆదర్శంగా మారుతోంది. మండలంలోని అన్ని పాఠశాలలకంటే మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న ప్రగతి బడిగా రూపుదిద్దుకుంది. హెచ్ఎం ఏర్పాటు చేసిన బెక్కంటి చారిటబుల్ ట్రస్టు చేయూతతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారం, దాతల సౌజన్యం దీనికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. దీంతో ఈ బడి అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతోంది. ఇటీవల ఐటీసీ సౌజన్యంతో రూ.8 లక్షలతో ప్రహరీ ఏర్పాటు చేశారు. అఖిల ఫౌండేషన్ సహకారంతో ఆర్వో ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ఉపాధి హామీ నిధుల నుంచి నూతన మరుగుదొడ్లు సమకూరాయి.
ఎంపీడీవో చంద్రమౌళి, ఎంఈవో సున్నం సమ్మయ్య సూచనల మేరకు సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఎస్ఎంసీ చైర్మన్ కుంజా నాగేశ్వరరావు సౌజన్యంతో స్వచ్ఛ విద్యాలయంగా రూపుదిద్దుకుందీ పాఠశాల. హెచ్ఎం బెక్కంటి శ్రీనివాసరావు చొరవతో పాఠశాల ప్రాంగణం పూర్తిగా పచ్చదనంతో నిండింది. పాఠశాల ఆవరణను మట్టితో చదును చేయించి 500 మొక్కలు నాటారు. వాటికి నీటి తడి అందించేందుకు పైపులైను సైతం ఏర్పాటు చేశారు. ఆవరణలోని పూలు, పండ్ల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గడిచిన రెండేళ్లలోనే ఈ పాఠశాలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దిన ఘనత ప్రధానోపాధ్యాయుడికే దక్కింది.
బడుల బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కార్యక్రమం ‘మన ఊరు – మన బడి’. కానీ మూడు నెలల క్రితమే ఈ పాఠశాలకు ‘మన ఊరు మన బడి’ టైటిల్‌ను తీర్మానించుకున్నారు గ్రామస్తులు, ఎస్ఎంసీ బాధ్యులు, ఉపాధ్యాయులు. అందరి సహకారంతో పాఠశాలను మరింత బాగు చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తాము తీర్మానించిన ‘మన ఊరు – మన బడి’ టైటిల్ పేరునే రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. హెచ్ఎం బెక్కంటి శ్రీనివాసరావు.
40 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న బెక్కంటి శ్రీనివాసరావు.. 2012లో అప్పటి రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్నారు. 2018 నుంచి బండారుగూడెం ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు.
బండారుగూడెం పాఠశాలలో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించారు. ఆర్వో ప్లాంట్, నూతన మరుగుదొడ్లు, బెంచీలు, బ్లాక్‌బోర్డులు, యూనిఫాం, నోటు పుస్తకాలు, టై, షూ, బెల్టులు వంటివి వాటిని దాతలు, బెక్కంటి చారిటబుల్ ట్రస్టు సహకారంతో అందించారు. డిజిటల్ పాఠాలు, యోగా ఆసనాలు వంటి మరిన్ని ప్రత్యేకతలు ఈ పాఠశాల సొంతం. ప్రహరీపై సృజనాత్మక చిత్రాలు.. ఈ పాఠశాల ప్రహరీ గోడలను చూస్తే.. చక్కటి సృజనాత్మక చిత్రాలు ఎన్నో పరమార్థాలను చూపుతున్నాయి. విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయల నిమిత్తం సేంద్రియ కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.
బండారుగూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల చిన్నదే. కానీ సౌకర్యాల కల్పన, అభివృద్ధిలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తోంది. పాఠశాల పరిసరాలు, అందులో విద్యాబోధన, విద్యార్థుల క్రమశిక్షణ వంటివి ఎంతో ప్రత్యేకం. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం అందుతున్నప్పటికీ పంచాయతీ నుంచి నిధులను కూడా సమీకరించి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం.
-చంద్రమౌళి, ఎంపీడీవో, దుమ్ముగూడెం
గడిచిన రెండేళ్లలోనే మా పాఠశాల రూపురేఖలను మార్చాం. దాతలు, గ్రామస్తుల సహకారంతో మౌలిక సదుపాయాలు కల్పించాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నాం. ఐటీడీఏ పీవో సైతం ఇటీవల సందర్శించి మౌలిక సదుపాయాల కల్పన బాగుందంటూ కితాబిచ్చారు. పాఠశాలను తీర్చిదిద్దానన్న సంతృప్తి ఎంతో ఉంది.
-బెక్కంటి శ్రీనివాసరావు, బండారుగూడెం పాఠశాల హెచ్ఎం